BJP March Bengal : బెంగాల్ లో బీజేపీ ఆందోళన ఉద్రిక్తం
సువేందు అధికారి, ఇతర నేతల అరెస్ట్
BJP March Bengal : పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. రాష్ట్రంలో టీఎంసీ పాలన అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని, దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించేందుకు పిలుపునిచ్చింది బీజేపీ(BJP March Bengal).
మంగళవారం కోల్ కతాలో చేపట్టిన ఈ నిరసనను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు సువేందు అధికారి, బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ, రాహుల్ సిన్హా, తదితర నేతలు పోలీసులకు మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది.
సెక్రటేరియట్ సమీపంలోని రెండో హుగ్లీ వంతెన వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. వారి పోలీస్ వ్యానులో తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు సువేందు అధికారి సీరియస్ అయ్యారు.
అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవినీతికి అడ్డాగా మారిందంటూ ధ్వజమెత్తారు. వెంటనే రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేస్తోందంటూ ధ్వజమెత్తారు సువేందు అధికారి. ఇది పూర్తిగా నిరంకుశ పాలన సాగిస్తోందంటూ మండిపడ్డారు సీఎం మమతా బెనర్జీపై(Mamata Banerjee).
కేసులు నమోదు చేసినా, అరెస్ట్ లకు పాల్పడినా తాము ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. నీతి వంతమైన పాలన అందిస్తామని చిలుక పలుకులు పలికిన సీఎం ఇప్పుడు తన కేబినెట్ లో ఇద్దరిని ఈడీ అదుపులోకి తీసుకుందని దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదంటూ ప్రశ్నించారు.
Also Read : గుజరాత్ లో కాంగ్రెస్ పనై పోయింది – కేజ్రీవాల్