Sharad Pawar Modi : మోదీ వల్లే గుజరాత్ కు చిప్ ఫ్యాక్టరీ – పవార్
వేదాంత నిర్వాకంపై పవార్ ఆగ్రహం
Sharad Pawar Modi : చిప్ ప్లాంట్ ఫ్యాక్టరీని మహారాష్ట్ర నుంచి గుజరాత్ కు తరలించడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఇప్పటికే శివసేన మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రే తీవ్రంగగా తప్పు పట్టారు.
ఇక ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మరాఠా వాసులను ఘోరంగా అవమానించారంటూ ప్రధాన మంత్రి మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది కేంద్రం.
ఈ మేరకు మరో ప్రాజెక్టును మహారాష్ట్రకు ఇప్పిస్తానంటూ ప్రధాన మంత్రి స్వయంగా హామీ ఇవ్వడం చర్చకు దారి తీసింది. ఈ తరుణంలో మొత్తం వ్యవహారంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) సీరియస్ అయ్యారు.
తల్లిని కొట్టి బిడ్డను ఓదార్చడం లాగా ఉంది ప్రధాని తీరు అని ఎద్దేవా చేశారు. శుక్రవారం పవార్ మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా వేదాంత కంపెనీ అనుసరించిన విధానం పూర్తిగా భిన్నంగా, విరుద్దంగా ఉందన్నారు.
మొదట మహా వికాస్ అఘాడీతో చర్చలు జరిపారని , కొన్ని రూల్స్ ను పాటించాల్సిందేనంటూ ఆనాడు స్పష్టం చేసిందన్నారు పవార్. ఈ మహా వికాస్ అఘాడీలో ఎన్సీపీ కీలక భాగస్వామిగా ఉంది.
ఇదే సమయంలో మరాఠాకు రావాల్సిన చిప్ ఫ్యాక్టరీ ప్లాంటు ఉన్నట్టుండి గుజరాత్ కు తరలించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ కంపెనీ మరాఠాకు రాకుండా చేసి తమ రాష్ట్రానికి తరలించుకు పోయేలా తెర వెనుక నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చక్రం తిప్పారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శరద్ పవార్. ఇది పూర్తిగా తమ ప్రాంతాన్ని అవమానించినట్లేనని పేర్కొన్నారు.
ఉన్న కీలకమైన ప్రాజెక్టు కాకుండా వేరే ప్రాజెక్టు మంజూరు చేస్తామని చెప్పడం దారుణమన్నారు. ఈ ప్రాజెక్టు వచ్చి ఉంటే కనీసం లక్ష మందికి ఉపాధి లభించేదన్నారు పవార్.
Also Read : ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ దాడులు