Bhagwant Mann : నిరసనల మధ్య మాన్ విశ్వాస తీర్మానం
అడ్డుకున్న ప్రతిపక్షాల ప్రజాప్రతినిధులు
Bhagwant Mann : విపక్షాల నిరసనలు, ఆగ్రహావేశాల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann) మంగళవారం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. శాసనసభకు ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడంపై గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ గత వారం తిరస్కరించారు.
దీనిపై పెద్ద రాద్దాంతం చెలరేగింది. దీంతో పంజాబ్ కేబినెట్ ఏకగ్రీవంగా సమావేశం నిర్వహించేందుకు తీర్మానం చేసి కాపీని గవర్నర్ కు సమర్పించింది. చివరకు విశ్వాస పరీక్షకు సిద్దంగా ఉన్నామంటూ ప్రకటించారు సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann). ఈ తరుణంలో ఆప్ , గవర్నర్ పురోహిత్ ల మధ్య యుద్దం కొనసాగింది.
చివరకు ఎట్టకేలకు దిగి వచ్చారు రాష్ట్ర గవర్నర్. ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇవాళ శాసనసభ ప్రారంభమైంది. ఏది ఏమైనప్పటికీ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలనే తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేశారు సీఎం భగవంత్ మాన్. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ప్రభుత్వం తను ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ ఆరోపించాయి. తన చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకే ఇలా చేశారంటూ సీఎంపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా రాష్ట్ర సర్కార్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు.
బీజేపీ ఎమ్మెల్యేలు శర్మ, జంగీలాల్ వ్యాపార సలహా కమిటీలో పార్టీ నుంచి ఎవరినీ చేర్చక పోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. సభకు అంతరాయం కలిగించినందుకు 15 మంది ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లి పోవాలంటూ స్పీకర్ ఆదేశించారు.
Also Read : కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో లేను – కమల్ నాథ్