JP Nadda : కాంగ్రెస్ అన్నా చెల్లెలి పార్టీ – జేపీ నడ్డా
ఇక అది జాతీయ పార్టీ కానే కాదు
JP Nadda : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. 134 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. దేశంలో బీజేపీకి ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీ అన్నది లేకుండా పోయిందన్నారు. తమపై పదే పదే విమర్శలు చేసే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదన్నారు.
తన పార్టీని సరిదిద్దు కోలేని ఆయన దేశాన్ని ఎలా ఉద్దరిస్తాడని ప్రశ్నించారు జేపీ నడ్డా(JP Nadda). భువనేశ్వర్ లో జరిగిన పార్టీ కార్యకర్తల మీటింగ్ లో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించాల్సిన పని లేదన్నారు. ఆ పార్టీకి గత చరిత్ర తప్ప ఇంకేం లేదన్నారు.
ఆ పార్టీ పూర్తిగా అన్నా చెల్లెలి పార్టీగా మారి పోయిందంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు జేపీ నడ్డా. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తామే అధికారంలోకి వస్తామని చెప్పారు బీజేపీ చీఫ్. ఇదిలా ఉండగా సీఎం నవీన్ పట్నాయక్ పై సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) ప్రభుత్వం పూర్తిగా అవినీతి, అక్రమాలతో కూరుకు పోయిందని ధ్వజమెత్తారు జేపీ నడ్డా(JP Nadda). రాబోయే కాలంలో దేశమంతటా కాషాయ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు. ప్రస్తుతం దేశంలో కుటుంబ పార్టీలు కొనసాగుతున్నాయని వాటికి అంత సీన్ లేదన్నారు.
జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ , యూపీలో సమాజ్ వాది పార్టీ, బీహార్ లో రాష్ట్రీయ జనతాదళ్ , పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ, ఒడిశాలో బిజూ జనతా దళ్, తెలంగాణలో టీఆర్ఎస్, తమిళనాడులో డీఎంకే, జార్ఖండ్ లో జేఎంఎం ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జేపీ నడ్డా.
Also Read : అధ్యక్ష పదవి ఎన్నికపై ప్రియాంక ఫోకస్