CM KCR : అణగారిన వర్గాల గొంతుక ములాయం – కేసీఆర్
ఆయన మృతి దేశానికి తీరని లోటు
CM KCR : మాజీ కేంద్ర మంత్రి, యూపీ మాజీ సీఎం, ఎస్పీ ఫౌండర్ ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ, రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్ర కనబర్చారని పేర్కొన్నారు.
ఒక రకంగా వ్యక్తిగతంగా తనకు సలహాలు, సూచనలు చేశారని గొప్ప నాయకుడిని కోల్పోవడం బాధగా ఉందని తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ నిజమైన సోషలిస్టు అని కొనియాడారు.
లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా తదితర మహోన్నత నాయకుల ఆదర్శాలను ప్రజలలోకి తీసుకు వెళ్లడంలో కీలకమైన పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
తన జీవితాంతం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని కితాబు ఇచ్చారు సీఎం కేసీఆర్(CM KCR). తనయుడు, మాజీ సీఎం , ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. స్వాతంత్ర సమర యోధుడు రాజ్ నారాయణ్ స్ఫూర్తితో ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారు.
భారత దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలో సాధారణ కుటుంబం నుంచి వచ్చి అసాధారణమైన నాయకుడిగా తనను తాను నిరూపించు కున్నారని పేర్కొన్నారు కేసీఆర్. మూడు సార్లు సీఎంగా పని చేశారు. అణగారిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా జీవితాంతం పనిచేశారని గుర్తు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా మంగళవారం ములాయం సింగ్ యాదవ్ స్వగ్రామం సఫాయిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే యూపీ సర్కార్ మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. మరో వైపు ములాయం మరణం భారతదేశ రాజకీయాల్లో ఓ శకానికి ముగింపు అని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.
Also Read : ములాయం రాజకీయ దిగ్గజం