Kerala CM : హిందీ ప్యానల్ నివేదికపై కేరళ సీఎం ఫైర్
మాతృ భాషపై యుద్దం తప్ప మరొకటి కాదు
Kerala CM : హిందీ భాష అమలుపై ఏర్పాటైన ప్యానల్ పూర్తి నివేదికను రాష్ట్రపతికి సమర్పించడాన్ని ఆయా రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తాము హిందీని అంగీకరించే ప్రసక్తి లేదంటున్నాయి.
ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, మరో సీనియర్ నాయకుడు అళగిరి ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై నిప్పులు చెరిగారు.
మాతృ భాషలను పరిగణలోకి తీసుకోకుండా మూకుమ్మడిగా హిందీనే వాడాలని సూచించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ మేరకు హిందీ ప్యానల్ నివేదిక సమర్పించడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్(Kerala CM) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.
నిబంధనలు కఠినతరమైనవని పేర్కొన్నారు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం, ఒకే జాతి ఉండాలన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతోందని దీనిని ఒక రకంగా భాష పేరుతో విభజించడం తప్ప మరొకటి కాదన్నారు. హిందీ మాట్లాడేవారంతా ప్రథమ పౌరులని ఇతర భాషలు మాట్లాడే వారంతా ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రీకరించే ప్రయత్నం బీజేపీ చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
దీనిని పూర్తిగా మానుకుంటే దేశానికి, ప్రధానంగా బీజేపీకి, దాని అనుబంధ సంస్థలకు మంచిదని పినరయి విజయన్ హితవు పలికారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు. అన్ని సాంకేతిక , నాన్ టెక్నికల్ ఉన్నత విద్యా సంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలని పార్లమెంటరీ ప్యానల్ చేసిన సిఫారసు ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నారు సీఎం.
Also Read : డీఎంకే అగ్ర నేత రాజాకు బిగ్ షాక్