Uniform Civil Code : సివిల్ కోడ్ చట్టం పార్లమెంట్ కే అధికారం
సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్ర సర్కార్
Uniform Civil Code : దేశ వ్యాప్తంగా సివిల్ కోడ్ పై తీవ్ర దుమారం చెలరేగుతోంది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కోర్టుకు సివిల్ కోడ్ పై చట్టాన్ని(Uniform Civil Code) రూపొందించడం అన్నది పార్లమెంట్ కే సర్వాధికారం ఉంటుందని స్పష్టం చేసింది.
ఇందులో ఇంకొకరి జోక్యం అంటూ ఉండదని పేర్కొంది. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ పై ఎలాంటి చట్టాన్ని రూపొందించాలని లేదా చట్టం చేయమని పార్లమెంట్ ను ఆదేశించ లేమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తన అఫిడవిట్ లో కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. వారసత్వం, దత్తత, వివాహం, విడాకులు, భరణం వంటి వాటిని నియంత్రించే వ్యక్తిగత చట్టాలలో ఏకరూపతను కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్ పై కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అఫిడవిట్ సమర్పించింది. ఈ పిటిషన్ ను వెంటనే కొట్టి వేయాలని కోరింది.
భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలను రూపొందించే అధికారం కేవలం పార్లమెంట్ (లోక్ సభ, రాజ్యసభ)కు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. దీనిపై ఇంకొకరి జోక్యం అంటూ ఉండదని స్పష్టం చేసింది. రాజ్యాంగం లోని ఆర్టికల్ 44 అనేది పౌరులందరికీ ఒకే విధమైన సివిల్ కోడ్ ను పొందేందుకు ప్రయత్నించాలని సూచించే ఆదేశిక సూత్రం అని పేర్కొంది.
రాజ్యాంగ పీఠికలో పొందు పర్చిన సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంశాన్ని బలోపేతం చేసేందుకు ఆర్టికల్ 44 తెలియ చేస్తుందని కేంద్ర న్యాయ శాఖ వెల్లడించింది.
Also Read : కాంగ్రెస్ బాద్ షా నువ్వా నేనా