Rishi Sunak : ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తా – రిషి సున‌క్

పీఎంగా ఎన్నుకుంటే బ్రిట‌న్ కు పూర్వ వైభ‌వం

Rishi Sunak : బ్రిట‌న్ లో రాజ‌కీయ సంక్షోభం ఇంకా కొన‌సాగుతోంది. పీఎంగా కొలువు తీరిన 45 రోజుల‌కే చేతులెత్తేశారు లిజ్ ట్ర‌స్. దీంతో త‌దుప‌రి ప్ర‌ధాన‌మంత్రి ఎవ‌రు అవుతార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. 100 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు ఎవ‌రికి ఉంటే వారు రేసులో నిలుస్తారు. ప్రస్తుతానికి ప్ర‌వాస భార‌తీయుడైన రిషి సున‌క్ తో పాటు పెన్నీ మార్డెంట్ , మాజీ ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్స‌న్ రేసులో నిలిచారు.

ఇప్ప‌టి వ‌ర‌కు బ్రిట‌న్ నుంచి అందిన విశ్వ‌సనీయ స‌మాచారం మేర‌కు రిషి సున‌క్ పోటీలో ముందంజ‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా రిషి సున‌క్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. త‌న‌ను గ‌నుక ప్ర‌ధాన‌మంత్రిగా ఎన్నుకుంటే ప్ర‌స్తుత రాజ‌కీయ సంక్షోభానికి తెర దించుతాన‌ని చెప్పారు.

అంతే కాదు బ్రిట‌న్ దేశానికి తిరిగి పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌స్తాన‌ని, ఆర్థిక రంగాన్ని బ‌లోపేతం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు రిషి సున‌క్(Rishi Sunak). గాడి త‌ప్పిన ప్ర‌ధాన రంగాల‌ను మ‌రింత ప‌టిష్టం చేస్తాన‌ని పేర్కొన్నారు. పార్టీలో పొర‌పొచ్చాలు లేకుండా చేస్తాన‌ని అన్నారు. ఆయ‌న మాజీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. త‌న‌ను తాను త‌దుప‌రి పీఎం రేసులో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రిషి సున‌క్ కు 100 మందికి పైగా స‌భ్యుల మ‌ద్ద‌తు ఉంది. పార్టీని బ‌లోపేతం చేసి దేశాన్ని మ‌రింత ఉన్న‌తంగా తీర్చి దిద్దేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హామీ ఇస్తున్నాన‌ని తెలిపారు. ప్ర‌స్తుతం రిషి సున‌క్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం రిషి సున‌క్ కు 148 మంది స‌భ్యులు మ‌ద్ద‌తు ఇస్తున్నారు.

Also Read : జిన్ పింగ్ నిజ‌మైన స్నేహితుడు – పీఎం

Leave A Reply

Your Email Id will not be published!