Mallikarjun Kharge : కూలీ కొడుకును కాంగ్రెస్ చీఫ్ అయ్యాను
తీవ్ర భావోద్వేగానికి లోనైన మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge : 137 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు చేపట్టారు. బుధవారం న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయంలో జరిగిన పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పి. చిదంబరం, జై రాం రమేష్ , కమల్ నాథ్ , దిగ్విజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్ , తదితర అతిరథ మహారథులు హాజరయ్యారు.
వీరితో పాటు మల్లికార్జున్ ఖర్గేకు పోటీగా బరిలో దిగి భారీ ఎత్తున ఓట్లను కొల్లగొట్టిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కూడా పాల్గొనడం విశేషం.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎన్నికైన ఖర్గేను(Mallikarjun Kharge) ప్రత్యేకంగా అభినందించారు సోనియా గాంధీ. అనంతరం ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ లేఖ అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
కూలీ కొడుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఎన్నికయ్యాడని చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. తాను ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. తనకు ఓటు వేసిన వారికి, తనను సపోర్ట్ చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు.
తన గతాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు మల్లికార్జున్ ఖర్గే. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Also Read : బరువు దిగింది ఉపశమనం లభించింది