Jairam Ramesh : ఎంఐఎం బీజేపీకి అనుకూలం – జైరాం రమేష్
కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని తగ్గించేందుకే ప్లాన్
Jairam Ramesh : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై(Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ ఛార్జ్ జైరాం రమేష్. ప్రధానంగా తామే మైనార్టీలకు రక్షణగా ఉన్నట్లు మాట్లాడుతున్న ఓవైసీ అంతర్గతంగా భారతీయ జనతా పార్టీకి మేలు చేకూర్చే పనిలో బిజీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జైరాం రమేష్ కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంగళవారం మాట్లాడారు. ఎంఐఎం ఎజెండా ఒక్కటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చడం. కాషాయ దళానికి వంత పాడటం తప్పితే చేసింది ఏమీ లేదన్నారు జైరాం రమేష్(Jairam Ramesh).
గత కొంత కాలంగా బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారనేది ఎన్నికల్లో తేలిందన్నారు. ఈ విషయం మైనార్టీలకే కాదు అన్ని వర్గాల ప్రజలకు తెలుసన్నారు. బీజేపీ నుంచి ఎంఐఎం ఆక్సిజన్ తీసుకుంటోందని తిరిగి అదే పార్టీకి బూస్టర్ డోస్ ఇస్తోందంటూ ఎద్దేవా చేశారు జైరాం రమేష్.
గతంలో యూపీఏలో భాగంగా ఉండేదని కానీ ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ సర్కార్ కు వత్తాసు పలుకుతూ రాజకీయంగా పబ్బం గడుపుతోందంటూ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా లేదా ఏ పార్టీ అయినా మద్దతు తెలుపడంలో అభ్యంతరం లేదన్నారు. కానీ విలువలను పక్కన పెట్టి తమ స్వప్రయోజనాల కోసం ఇతర పార్టీలతో చేతులు కలపడం అనేది మంచి పద్దతి కాదన్నారు.
ప్రతిసారి ఎన్నికల్లో ఎంఐఎం నిలబడటం తమ పార్టీకి వచ్చే ఓట్లను చీల్చడం తప్ప చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు జై రాం రమేష్.
Also Read : రాహుల్ యాత్రకు పైసల్లేవు – జగ్గారెడ్డి