Arvind Kejriwal : ఆప్ గుజరాత్ సీఎం అభ్యర్థి ప్రకటన
ప్రజాభిప్రాయం ప్రకారం వెల్లడి
Arvind Kejriwal : గుజరాత్ ఎన్నికల నగారా మోగింది. పంజాబ్ లో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తామని ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) . 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు రాగా కాంగ్రెస కు 77 సీట్లు వచ్చాయి. గతంలో ద్విముఖ పోరు ఉండగా ఈసారి జరిగే ఎన్నికల్లో త్రిముఖ పోటీ కొనసాగే అవకాశం ఉంది.
గురువారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ప్రజాభిప్రాయం ఆధారంగా గుజరాత్ ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గుజరాత్ సీఎం అభ్యర్థిని శుక్రవారం ప్రకటిస్తామని వెల్లడించారు అరవింద్ కేజ్రీవాల్. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది.
డిసెంబర్ 1, 5న రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది ఆప్. ప్రజలు బీజేపీ పాలనను చూసి విసిగి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఆప్ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి మనోజ్ సారథియా. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే దానిపై నవంబర్ 4న క్లారిటీ వస్తుందన్నారు.
అన్ని పార్టీలు తమకు కోరిన విధంగా అభ్యర్థులను ఎంపిక చేస్తాయని కానీ ఆప్ సామాన్య ప్రజల నుంచి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముందే ప్రకటిస్తుందన్నారు. ఇలాంటి వ్యవస్థ దేశంలో ఇంకెక్కడా లేదన్నారు. ప్రస్తుతం సంకేతాలు చూస్తుంటే ఆప్ వైపు ప్రజలు చూస్తున్నారనేది అర్థం అవుతోందని స్పష్టం చేశారు.
Also Read : నా లక్ష్యం అవినీతి రహిత భారతం – మోదీ