Komatireddy Rajgopal Reddy : ధర్మ యుద్దంలో గెలుపు నాదే
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా
Komatireddy Rajgopal Reddy : ధర్మానికి అధర్మానికి మధ్య యుద్దం కొనసాగుతోంది. ఈ కురుక్షేత్రంలో చివరకు పాండవులదే విజయం అన్నది గుర్తు పెట్టుకోవాలి. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా , బెదిరించినా చివరకు చంపినా ప్రజలు మాత్రం తనను గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajgopal Reddy) .
నన్ను బద్నాం చేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదన్నారు. గత ఎనిమిది సంవత్సరాల గులాబీ పాలనలో దోపిడి తప్ప, దౌర్జన్యాలు తప్ప అభివృద్ధి జరిగిన పాపాన పోలేదన్నారు రాజగోపాల్ రెడ్డి. పెద్ద ఎత్తున స్థానికేతరులు మునుగోడులో తిష్ట వేశారని, రిగ్గింగ్ కు పాల్పడాలని చూస్తున్నారంటూ ఆరోపించారు.
కానీ దైవం తన వైపున ఉందని, ధర్మం ప్రకారం తానే గెలుస్తానని ఆ లక్ష్మి నరసింహ స్వామి సాక్షిగా చెబుతున్నానని అన్నారు. పోలీసులు, ఎన్నికల కమిషన్ సైతం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. విచిత్రం ఏమిటంటే రాష్ట్రంలో పాలన సాగించాల్సిన వ్యవస్థలు, పాలకవర్గం అంతా ఇక్కడ తిష్ట వేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
తెలంగాణ ధనిక రాష్ట్రం అని పదే పదే నీతులు వల్లించే సీఎం ఎందుకని ఇంత మందిని ఇక్కడ మోహరించేలా చేశాడంటూ నిలదీశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ప్రస్తుతం తమ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్లను బెదిరించారని ఇలాంటి నీచ సంస్కృతి తాను ఎప్పుడూ చూడలేదన్నారు. బయటి నుంచి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంకా మునుగోడులోనే ఉన్నారని వికాస్ రాజ్ చెప్పినవన్నీ అబద్దాలేనంటూ ఆరోపించారు.
Also Read : కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది – బండి