ED Raids : పశ్చిమ బెంగాల్..జార్ఖండ్ లలో ఈడీ దాడులు
అక్రమ భూ కబ్జా కేసులో పలు చోట్ల సోదాలు
ED Raids : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. దేశంలోని పలు చోట్ల దాడులు ముమ్మరం చేసింది. నిన్నటికి నిన్న అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీఎం హేమంత్ సోరేన్ కు సమన్లు జారీ చేసింది. ఆయన ఈడీ సమన్లను బేఖాతర్ చేశారు.
తాను ఏ నేరం చేయలేదని పేర్కొన్నారు. ఈ తరుణంలో తాజాగా అక్రమ భూ కబ్జా కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ , జార్ఖండ్ లోని డజను చోట్ల ఈడీ దాడులు చేపట్టింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నాలుగు చోట్ల , జార్ఖండ్ రాష్ట్రంలోని ఎనిమిది చోట్ల మొత్తం 12 చోట్ల దాడులు(ED Raids) కొనసాగుతున్నాయి.
సోదాలు చేపట్టిన ప్రదేశాలలో కోల్ కతాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అగర్వాల్ తో పాటు మరికొంత మంది నివాసాలు, ఆఫీసు ప్రాంగణాలలో దాడులు చేపట్టింది ఈడీ. భారతీయ ఆర్మీ భూములను అక్రమంగా స్వాధీనం చేసున్న వారిపై మనీ లాండరింగ్ కేసులో దాడులు చేపట్టినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇంతకు ముందు ఈడీ అమిత్ అగర్వాల్ ను అరెస్ట్ చేసింది.
ఈ కేసు విచారణలో అగర్వాల్ చెప్పిన మేరకు మరికొన్ని చోట్ల దాడులు, సోదాలు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది. బెంగాల్ తో పాటు జార్ఖండ్ లోని అనేక ఎకరాల ఆర్మీ భూములను ల్యాండ్ మాఫియాలు , రాజకీయ నాయకులతో కలిసి అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు తేలిందని ఈడీ తెలిపింది.
గత జూలై 31న కోల్ కతా లో న్యాయవాది రాజీవ్ కుమార్ నుంచి రూ. 50 లక్షలు స్వాధీనం చేసుకున్న కేసులో అమిత్ అగర్వాల్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది.
Also Read : ఆశించడం..కోరుకోవడం సహజం – గెహ్లాట్