Kris Gopalakrishnan : ఐటీ రంగానికి ఢోకా లేదు – గోపాలకృష్ణన్
భవిష్యత్తు అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీదే
Kris Gopalakrishnan : ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యంతో వేలాది ఉద్యోగాలకు కోత పెడుతుండగా భారతీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిష్ గోపాలకృష్ణన్(Kris Gopalakrishnan) సంచలన ప్రకటన చేశారు. సమీప భవిష్యత్తులో ఏకంగా 2 లక్షల ఉద్యోగాలు ఐటీ పరంగా రానున్నాయని చెప్పారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ టెక్నాలజీతో అనుసంధానం లేకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచం మనుగడ సాధించ లేదని స్పష్టం చేశారు.
బెంగళూరు వేదికగా జరిగిన టెక్ సదస్సులో క్రిష్ గోపాల కృష్ణన్ పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం ఐటీ సెక్టార్ ఉద్యోగుల వలసలు, వర్క్ ఫ్రం హోం , మూన్ లైటింగ్ విధానంతో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు.
అయినప్పటికీ ఇదంతా తాత్కాలికం మాత్రమేనని త్వరలోనే మంచి రోజులు వస్తాయని చెప్పారు క్రిష్ గోపాల కృష్ణన్(Kris Gopalakrishnan). ఐటీ కంపెనీలు తిరిగి పుంజుకుంటాయని, ఐటీ పరంగా నిపుణులకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి తాజాగా మెటా ఇండియా హెడ్ గా ఎంపికైన సంధ్యా దేవనాథన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అపారమైన అనుభవమే గీటురాయిగా ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటే కొలువులకు ఢోకా అంటూ ఉండదన్నారు. భారీ ఎత్తున ఉద్యోగాలు వస్తాయని మరోసారి స్పష్టం చేశారు క్రిష్ గోపాలకృష్ణన్. రాబోయే 12 ఏళ్ల వరకు కూడా డిజిటలైజేషన్ హవా కొనసాగుతుందన్నారు.
పరిశ్రమలో ఒడిదుడుకులు సహజమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మాంద్యం అనేది కొంత కాలంపాటు మాత్రమే ఉంటుందన్నారు.
Also Read : త్రిష్నీత్ అరోరాకు కమలా హారిస్ పిలుపు