RS Praveen Kumar : బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం – ఆర్ఎస్పీ
52 శాతానికి 27 శాతం మాత్రమే అయితే ఎలా
RS Praveen Kumar : బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన తరగతుల కులాలకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించిన అంశంపై సంచలన ప్రకటన చేశారు.
ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈనెల 26 నుండి తాము ఆందోళనలు, నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కోటి సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
గురువారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మీడియాతో మాట్లాడారు. గ్రామ స్థాయి నుండి పట్టణం, నగర స్థాయి దాకా తమ పోరు ఆగదన్నారు. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కానే కాదని కానీ ఏ తీర్పు అయినా అది న్యాయబద్దంగా, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఉండాలని పేర్కొన్నారు.
దేశంలో 52 శాతానికి పైగా బహుజనులు ఉన్నారని కానీ వాళ్లకు 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఎలా న్యాయం జరుగుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
ఇక అగ్రవర్ణాలలో పేదలు కేవలం 8 శాతం మంది మాత్రమే ఉన్నారని కానీ వాళ్లకు మాత్రం 10 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని ఎలా కల్పిస్తారని నిలదీశారు. ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో దేశ ప్రజలకు ముఖ్యంగా సగ భాగమైన బహజునులకు తెలియల్సిన అవసరం ఉందన్నారు ఆర్ఎస్పీ.
జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యం ఉండాలని స్పష్టం చేశారు ఆర్ఎస్పీ. అంతే కాకుండా ఉన్నత న్యాయ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కోటా ఉండాలని అభిప్రాయపడ్డారు.
Also Read : సీఈసీ నియామకం కేంద్రం అత్యుత్సాహం