YS Sharmila : అరెస్ట్ చేసినా ఆగం ప్రగతి భవన్ ముట్టడిస్తం
పోలీసులు కేసీఆర్ కు జీతగాళ్లు
YS Sharmila : రాష్ట్రంలో బతికే పరిస్థితులు లేకుండా చేస్తున్నారు. పోరాడాల్సిన పార్టీలు అమ్ముడు పోయాయి. మేం ప్రజల తరపున మాట్లాడుతున్నాం. వారి సమస్యలను ప్రస్తావిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో సీఎం కేసీఆర్ కు హక్కులు ఉన్నట్లే తమకు కూడా ఉంటాయన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila).
ప్రస్తుతం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఆమె సీరియస్ గా స్పందించారు. ఎంత మంది ఖాకీలు వచ్చినా తాము ప్రగతి భవన్ ను ముట్టడించి తీరుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ , బీజేపీ కేసీఆర్ కు ఊడిగం చేస్తున్నాయంటూ ధ్వజమెత్తారు.
శాంతి భద్రతల సమస్యలను వారే సృష్టించి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ లు చేస్తున్నారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిల(YS Sharmila). పాదయాత్రలో తాము లేవనెత్తిన సమస్యలను, చేసిన సవాళ్లను ఎదుర్కొనే దమ్ము లేకనే దొడ్డి దారిన దాడులకు పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక మహిళ అని చూడకుండా రాక్షసుల్లా ప్రవర్తించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇప్పటి దాకా రాష్ట్రాన్ని దోచుకున్నది చాలదా అని నిలదీశారు. ఎమ్మెల్యేలు నీ బాంచన్ దొర అంటున్నారని కానీ తాము అలా కాదన్నారు.
పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా మారారని , దాడులు చేస్తున్న టీఆర్ఎస్ గూండాలను కాదని తమపై దాడులకు దిగడం, అరెస్ట్ లు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తనపై దాడి చేయించినందుకు సీఎం కేసీఆర్ కు సిగ్గుండాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల.
Also Read : విద్యార్థులకు జగనన్న తీపి కబురు