Ashok Gehlot : గుజరాత్ లో బీజేపీ ఓటమి ఖాయం – గెహ్లట్
రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
Ashok Gehlot : రాజస్థాన్ సీఎం, గుజరాత్ ఎన్నికల ఇన్ చార్జ్ అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 182 స్థానాలకు గాను అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఇందులో భాగంగా 89 స్థానాలలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. రెండో విడత ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.
ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏకంగా 54 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా పీఎం షేర్ చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot). ఏం ఉద్దరించారని వీడియో పంచుకున్నారంటూ ఎద్దేవా చేశారు.
దేశాన్ని, రాష్ట్రాన్ని బడా వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేలా చేయడం తప్ప ఒక్క మంచి నిర్ణయం ఇంత వరకు తీసుకోలేదని ఆరోపించారు. మోదీ ఎన్ని మాయ మాటలు చెప్పినా అమిత్ షా ఎన్ని వ్యూహాలు పన్నినా ఈసారి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమేనని జోష్యం చెప్పారు.
ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. గత 27 ఏళ్లుగా గుజరాత్ లో కొలువుతీరిన బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రిగా ఉన్న మోదీ దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే గుజరాత్ లోనే మకాం వేయడం దారుణమన్నారు.
దీని వెనుక గల కారణం ఏమిటో చెప్పాలన్నారు గెహ్లాట్(Ashok Gehlot). రాష్ట్రంలో బీజేపీ సర్కార్ పై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే మోదీ ఇక్కడే తిష్ట వేశారని ఎద్దేవా చేశారు సీఎం.
Also Read : రాహుల్ గాంధీకి కర్ణాటక హైకోర్టు నోటీసు