YS Sharmila : కేసీఆర్ కు నేనే ప్ర‌త్యామ్నాయం – ష‌ర్మిల‌

ఆయ‌న నుంచి ప్రాణహాని ఉందంటూ ఆరోప‌ణ‌

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కావాల‌ని త‌న పాద‌యాత్ర‌ను అడ్డుకున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో తానొక్క దానినే సీఎం కేసీఆర్ కు ప్ర‌త్యామ్నాయం అని స్ప‌ష్టం చేశారు. సీఎం కుట్ర‌లు ప‌న్నడంలో ఆరితేరార‌ని ఆయ‌న నుంచి భ‌విష్య‌త్తులో త‌న‌కు ప్రాణ హాని ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఆదివారం వైఎస్ ష‌ర్మిల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది లేకుండా పోయింద‌న్నారు. రాచ‌రిక పాల‌న కొన‌సాగుతోంద‌న్నారు. తాను పోటీ అవుతాన‌ని కేసీఆర్ త‌న పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా అడ్డు ప‌డుతున్నాడంటూ ఆరోప‌ణ‌లు చ‌స్త్రశారు వైఎస్ ష‌ర్మిల‌. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలు నోరు మూసుకున్నాయ‌ని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ నేత‌లు ఎందుకు ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నించడం లేద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణలో మిగ‌తా పార్టీల నేత‌ల పాద‌యాత్ర‌ల‌కు అనుమ‌తి ఇస్తూ త‌న‌ను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ నిప్పులు చెరిగారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila).

విచిత్రం ఏమిటంటే తాను మ‌హిళ‌న‌ని కూడా చూడ‌కుండా తాలిబ‌న్లు వాడే భాష‌ను వాడుతున్నారంటూ మండిప‌డ్డారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ‌ను మ‌ద్యం ఏరులై పారేలా చేశార‌ని అన్నారు. ఏకంగా మ‌హిళా నేత, సీఎం కేసీఆర్ కూతురు క‌విత లిక్క‌ర్ స్కాంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కోవ‌డం దారుణ‌మ‌న్నారు.

ఇది ప్ర‌తి ఒక్క‌రు సిగ్గు ప‌డాల్సిన విష‌య‌మ‌న్నారు ష‌ర్మిల‌. హైకోర్టు అనుమ‌తి ఇచ్చినా త‌న పాద‌యాత్ర అడ్డుకోవాల‌ని చూశారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఖాకీల‌ను త‌న జీతగాళ్లుగా సీఎం భావిస్తున్నారంటూ ఆరోపించారు. ప్ర‌భుత్వ అవినీతి, అక్ర‌మాల‌ను నిల‌దీస్తున్నందుకు , ప్ర‌శ్నిస్తున్నందుకు త‌న‌ను టార్గెట్ చేశార‌ని వాపోయారు ష‌ర్మిల‌.

Also Read : ‘అమ‌ర‌త్వానికి’ గుర్తింపు ఏది..?

Leave A Reply

Your Email Id will not be published!