Dimple Yadav : ఓటర్లకు బీజేపీ డబ్బులతో ఎర – డింపుల్
నిప్పులు చెరిగిన ఎస్పీ అభ్యర్థి
Dimple Yadav : సమాజ్ వాది పార్టీ అభ్యర్థి, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్(Dimple Yadav) సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం మెయిన్ పురి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా డింపుల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ఆరోపించారు.
వారంతా ఓటర్లకు డబ్బులు బహిరంగంగా పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయం గురించి తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు డింపుల్ యాదవ్. ఈ సందర్బంగా డబ్బులు పంపిణీ చేస్తున్న విషయం గురించి కేంద్ర , రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు.
వందలాది మంది కాషాయ శ్రేణులు డబ్బులు, మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సమాజ్ వాదీ పార్టీ ప్రతినిధి బృందం ఇవాళ రాత్రి ఎన్నికల కమిషన్ తో కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు డింపుల్ యాదవ్ వెల్లడించారు. అంతే కాకుండా బీజేపీ శ్రేణులకు వ్యతిరేకంగా వీలైతే తాము ఆందోళన కూడా చేపడతామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా యూపీలో సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు , మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఇటీవలే మరణించారు. దీంతో మెయిన్ పురి లోక్ సభ సీటు ఖాళీ ఏర్పడింది. ఈ నియోజకవర్గంతో పాటు యూపీలోని మరో రెండు స్థానాలు రాంపూర్ సదర్ , ఖతౌలీలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
Also Read : గుజరాత్ లో రెండో విడత పోలింగ్