Mamata Banerjee : సాకేత్ గోఖలే అరెస్ట్ అక్రమం – సీఎం
ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యకు ప్రతీక
Mamata Banerjee : దేశ వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది ట్వీట్ల వ్యవహారం. దేశంలో కొలువు తీరిన ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గత కొంత కాలంగా ఉక్కు పాదం మోపుతోంది.
తనకు వ్యతిరేకంగా ఏ కొంచెం ఎవరైనా ప్రశ్నించినా లేదా నిలదీసినా , ట్వీట్లు చేసినా, రాసినా వెంటనే వారిపై నిఘా పెడుతోంది. ఆపై కేసులు, అరెస్టులకు పాల్పడుతోందంటూ నిప్పులు చెరిగారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee).
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసినందుకు గాను బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలేకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు దీదీ. ఇందుకు సంబంధించి కావాలని కేంద్రం కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతోందని ఆరోపించారు.
ఈ సంఘటన దురదృష్టకరం, బాధాకరమని పేర్కొన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. సాకేత్ గోఖలే తెలివైన వ్యక్తి అని, సోషల్ మీడియాలో అత్యంత పాపులర్ అని ప్రశంసించారు మమతా బెన్జీ. అతను ఏ తప్పు చేయలేదన్నారు.
జైపూర్ ఎయిర్ పోర్ట్ లో మమతా బెనర్జీ(Mamata Banerjee) మంగళవారం మీడియాతో మాట్లాడారు. గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలాగే ఉంటే దేశంలో ఇంకెవరూ ప్రశ్నించేందుకు ముందుకు రారని మండిపడ్డారు.
ఈ ప్రతీకార వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు సీఎం. ప్రజలు కూడా తనకు వ్యతిరేకంగా ట్వీట్ చేస్తారని అలా అని తాను వేధింపులకు పాల్పడలేదన్నారు. ప్రతి దానిని సహృదయంతో అర్థం చేసుకోవాలన్నారు.
Also Read : ఫోటో ఫస్ట్ ఓటు నెక్ట్స్ – ప్రకాశ్ రాజ్