S Jai Shankar : ఇకనైనా యుద్దాన్ని ఆపండి – జై శంకర్
ఉక్రెయిన్ , రష్యా దేశాలకు విన్నపం
S Jai Shankar : కొత్త సంవత్సరంలో కీలక ప్రకటన చేశారు భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్. ఇకనైనా ఉక్రెయిన్, రష్యా దేశాలు యుద్దాన్ని ఆపాలని కోరారు. ఇరు దేశాల అధ్యక్షులు జెలెన్ స్కీ, వ్లాదిమిర్ పుతిన్ లు సంయమనం పాటించాలని సూచించారు. సంభాషణ, దౌత్య పరంగా చర్చలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి.
భారత దేశం యుద్దాన్ని కోరుకోదని మరోసారి స్పష్టం చేశారు. వియన్నాలో పర్యటిస్తున్న జై శంకర్(S Jai Shankar) బల్గేరియా అధ్యక్షుడు రుమెన్ జార్జివ్ రాదేవ్ , ఆస్ట్రియన్ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ , ఇతరులతో భేటీ అయ్యారు. యుద్దం వల్ల ఇప్పటికే ఎంతో మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారని, మరో వైపు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరు దేశాధినేతలు ఆధిపత్య దోరణిని మానుకోవాలని , ఎవరో ఒకరు చర్చలు జరిపేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు సుబ్రమణ్యం జై శంకర్. ఈ యుద్దం వల్ల ఇరు దేశాలు తీవ్రంగా నష్ట పోతాయని , దీని ప్రభావం ఆ దేశాలపైనే కాకుండా యావత్ ప్రపంచంపై ఉంటుందన్నారు.
ఇది ఇరువురికీ మంచిది కాదని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. తమ దేశం పూర్తిగా శాంతి వైపు ఉందని, హింస, విభేదాల ద్వారా సమస్యలు పరిష్కారం కావని కుండ బద్దలు కొట్టారు జై శంకర్(S Jai Shankar).
దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఇప్పటికే పలుమార్లు ఇరు దేశాధి నేతలతో మాట్లాడారని తెలిపారు. కానీ వారు వినిపించుకునే స్థితిలో లేరన్నారు. ఇకనైనా ఈ కొత్త ఏడాదిలో యుద్దాన్ని నిలుపుదల చేయాలని కోరారు జై శంకర్.
Also Read : కరోనా కేసులతో పరేషాన్