Revanth Reddy : రాష్ట్రంలో రాచరిక పాలన – రేవంత్
ఖాకీల తీరుపై టీపీసీసీ చీఫ్ ఆగ్రహం
Revanth Reddy : సర్పంచులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. టీపీసీసీ చీఫ్ ను మొదట గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. మరో వైపు గాంధీ భవన్ వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. తాను ఎంపీనని ఎలాంటి నోటీసు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy) .
పోలీసులకు, రేవంత్ కు మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరకు బలవంతంగా ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపు రెండున్నర గంటల అనంతరం రేవంత్ రెడ్డిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందన్నారు. పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ కు కాలం మూడిందని, ఆయన ఉండేది ఇక ఆరు నెలలే అని ఎద్దేవా చేశారు టీపీసీసీ చీఫ్(Revanth Reddy) .
సర్పంచ్ లకు రావాల్సిన కోట్ల నిధులను సీఎం పక్కదారి పట్టించాడని , ముందు ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసేంత దాకా తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. మరో వైపు ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు బయలు దేరిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక రేవంత్ రెడ్డిని బొల్లారం పీఎస్ కు తరలించడంతో అక్కడికి చేరుకున్నారు. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. చివరకు ఆయనను విడుదల చేయడంతో గొడవ సద్దు మణిగింది.
Also Read : దేశం కోసం ప్రజల కోసం బీఆర్ఎస్