BRS Meeting Khammam : ఖమ్మం గులాబీమయం
5 లక్షల మంది జన సమీకరణ
BRS Meeting Khammam : తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ముందస్తు ఆలోచన లేదంటూనే ప్రకటిస్తూ వస్తున్న సీఎం కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టారు. ఆయన ఓ పట్టాన ఎవరికీ అర్థం కారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. గతంలో తెలంగాణ అనేది వాడుకలో ఉండేది.
దానిని మెల మెల్లగా తుడిచి వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూతురు కూడా తెలంగాణ సంస్కృతి అని పేర్కొనేది. కానీ మాట మార్చింది ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంది. తెలుగు సంస్కృతి అంటూ కొత్త రాగం ఆలాపిస్తోంది. ఈ తరుణంలో పూర్తిగా బీఆర్ఎస్ గా మార్చేశాక భారీ ఎత్తున బహిరంగ సభకు ప్లాన్ చేశారు సీఎం.
ఈ మేరకు ఇప్పటికే తేదీ కూడా ఖరారైంది. జనవరి 18న ఖమ్మంలో(BRS Meeting Khammam) భారీ సభకు శ్రీకారం చుట్టారు. మొత్తం 100 ఎకరాల్లో సభకు ఏర్పాటు చేశారు. 400 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. దీనిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాయి పార్టీ శ్రేణులు. భారీ ఎత్తున నభూతో నభవిష్యత్ అన్న చందంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే భారీ ఎత్తున కటౌట్లు , హోర్డింగ్ లతో హోరెత్తిస్తున్నారు. దీంతో ఖమ్మం పూర్తిగా గులాబీ మయంగా మారింది. యావత్ దేశం ఈ సభపై ఫోకస్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సభతో దేశ రాజకీయాలలో మార్పులు చోటు చేసుకుంటాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
ఇందు కోసం ఏకంగా 5 లక్షల మందిని సమీకరించాలని పార్టీ టార్గెట్ పెట్టుకుంది. ఈ సభకు నలుగురు సీఎంలు హాజరు కానున్నట్లు సమాచారం. 15 వేల మంది వీఐపీలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
Also Read : దేశమంతా ఉచిత కరెంట్..రైతు బంధు