#Leprosy : అవగాహన కలిగించటమే వ్యాధి నివారణకు మార్గం
Leprosy : కుష్టు వ్యాధిబారిన పడిన ప్రజల సంరక్షణ కోసం మహాత్మా గాంధీ చేసిన ప్రయత్నాలు మరియు కుష్టువ్యాధి గ్రస్తులకు కల్పించాలని అనుకున్న అవసరాలకు గుర్తుగా గాంధీ వర్ధంతి అయిన జనవరి 30 వ తేదీని కుష్టు వ్యాధి నివారణ దినోత్సవంగా మన దేశములో జరుపుకుంటున్నాము.
Leprosy : కుష్టు వ్యాధిబారిన పడిన ప్రజల సంరక్షణ కోసం మహాత్మా గాంధీ చేసిన ప్రయత్నాలు మరియు కుష్టువ్యాధి గ్రస్తులకు కల్పించాలని అనుకున్న అవసరాలకు గుర్తుగా గాంధీ వర్ధంతి అయిన జనవరి 30 వ తేదీని కుష్టు వ్యాధి నివారణ దినోత్సవంగా మన దేశములో జరుపుకుంటున్నాము.
పూర్వ కాలం నుంచి మానవులను పట్టిపీడిస్తున్న రకరకాల వ్యాధుల్లో ఇది ఒకటి. గతంలో దీనిని భయంకరమైన వ్యాధి గా పరిగణించారు. ఈ వ్యాధి సోకిన వారిలో నాడి వ్యవస్థ పై ముందుగా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.ఆ తర్వాత చేతులు, కాళ్ల పై దీని ప్రభావము ఎక్కువగా ఉంటుంది. ముందు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. ప్రజలలో కుష్ఠు నివారణపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 30 వ తేదీన ప్రపంచ కుష్ఠు నివారణ దినోత్సవం జరుపుకొంటున్నాం. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్ఠు వ్యాధి(Leprosy) నివారణపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
శరీరముపై పాలిపోయిన లేదా రాగి రంగు మచ్చలు ఉన్నప్పుడు,ఆ మచ్చలపై స్పర్శజ్ఞానము లేనపుడు మరియు నొప్పి తెలియనపుడు, శరీరమందు ముఖ్యంగా పాదములు, చేతులు, వ్రేళ్లు తిమ్మెరలు ఉన్నప్పుడు,చర్మం దళసరిగా ఉన్నప్పుడు ఈ వ్యాధి గా అనుమానించవచ్చు.
కుష్ఠువ్యాధి(Leprosy) ఇతర అంటు వ్యాధులవలె సూక్ష్మ క్రిమి వల్ల వస్తుంది. ఇది మైక్రో బాక్టీరియల్ ద్వారా సంక్రమించు ఒక అంటు వ్యాధి.హాన్సెన్ వ్యాధి గా కూడా దీనిని పిలుస్తారు. కుష్టు వ్యాధి, మైకోబాక్టీరియం లెప్రే మరియు మైకోబాక్టీరియం లెప్రోమటోసిస్ బాక్టీరియా వలన కలిగే దీర్ఘకాలిక వ్యాధి.
ఈ వ్యాధి ప్రారంభంలో , ఎటువంటి అంటువ్యాధి లక్షణాలను బయట పడకుండా దాదాపు ఐదు నుండి పది సంవత్సరాల వరకు ఉంటుంది. శరీరంలో వ్యాధి లక్షణాలు పెరగడం వల్ల నరాలు బలహీనంగా మారడం, చర్మం మరియు కళ్ళు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి.ఈ మార్పుల వల్ల నొప్పి తెలుసుకునే సామర్థ్యం కోల్పోవడం, గాయాల కారణంగా శరీర భాగాలు పూర్తిగా దెబ్బతింటాయి.శరీరం బలహీన పడుతూ క్రమక్రమంగా చూపు తగ్గుతుంది. ఈ వ్యాధి వయసు, లింగ బేధం లేకుండా ఎవరికైనా రావొచ్చు.
1873వ సం.లోనే హన్ సన్ అను నార్వే దేశపు శాస్త్రవేత్త ఈ వ్యాధి కారకమైన సూక్ష్మ జీవిని కనుగొన్నాడు.వ్యాధి తీవ్రతను బట్టి 6 నెలలు నుండి 18 నెలలు సక్రమంగా మందులు వాడడం వల్ల వ్యాధిని పూర్తి గా తగ్గించ వచ్చు.వ్యాధిని ఎట్టి పరిస్థితుల్లో దాచవద్దు.ఏమైనా అనుమానం ఉంటే వెంటనే డాక్టర్ల ను సంప్రదించాలి.మొదటి దశలోనే వ్యాధిని గుర్తించి మందులు వాడితే అనారోగ్యాన్ని, అంగవైల్యాన్ని నివారించవచ్చు.
కుష్ఠు వ్యాధి(Leprosy)కి శక్తివంతమైన చికిత్స 1930 సంవత్సరం నాటికే అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఔషధాలను అవసరానికి మించి ఉపయోగించడం కారణంగా వ్యాధి చికిత్సకు లొంగకుండా పోయింది. 1980లో బహుళ ఔషధ చికిత్స అందుబాటులోకి వచ్చిన తర్వాత తిరిగి విజయవంతంగా చికిత్స చేయడం సాధ్యమైంది. వైద్యుల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలి.ప్రజలలో కుష్టు వ్యాధిపై అవగాహన పెంచేందుకుఆ వ్యాధి బారినపడ్డ వారికి అవసరమైన సాధారణ మరియు ఉచిత చికిత్సఅందించడానికి రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి.
వ్యాధి బారినపడిన వ్యక్తికి చర్మంపై వచ్చే పుళ్ళు మరియు నరాల బలహీనత వల్ల భౌతిక లోపాల విషయంలో మానసిక ధైర్యం పెంపొందించడానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యాధి బారినపడిన వారందరికీ అవసరమైన చికిత్స అందించడములో వైద్యులు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు.
కుష్టు వ్యాధి నివారణలో భారతదేశం చేసిన కృషి విజయవంతమైంది.1995 వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండునుంచి మూడు మిలియన్ల మంది ఈ వ్యాధికి గురై,వికలాంగులుగా మారినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలు చెప్పాయి. గత ఇరవై సంవత్సరాల కాలంలో సుమారు 14 మిలియన్ల మంది వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసి వ్యాధిని తగ్గించారు. కుష్టు వ్యాధి శాపం కాదు. సరైన పద్ధతిలో మందులు వాడితే అంగవైకల్యం ఏర్పడదు.
సమాజంలో కుష్ఠు వ్యాధి ఉన్నవారిపై వివక్ష చూపొద్దు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆశా కార్యకర్తలను, ఏఎన్ఎంలను, ఆరోగ్య కేంద్రం లో సంప్రదించి అనుమానం తొలగించుకోవాలి. వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స తీసుకోవాలి. దీని ద్వారా అంగవైకల్యం రాకుండా నివారించుకోవచ్చు
ప్రపంచవ్యాప్తంగా 1980 సంవత్సరము వరకు దాదాపు 5 లక్షలకు పైగా ఉన్నా కుష్టు వ్యాధి సోకిన వారి నుండి,2020 వచ్చేసరికి ఆ సంఖ్యను విశ్వవ్యాప్తంగా ఒక లక్ష లోపు తీసుకురావడంలో ప్రజల అవగాహన మరియు ప్రభుత్వాల కృషి అభినందనీయం. కుష్టు వ్యాధి బారిన పడిన వారికి అవగాహన కల్పించడానికి 1954 లో ప్రపంచ కుష్టు దినోత్సవం ప్రారంభించబడింది.
కుష్టువ్యాధి సోకిన వారు క్రమం తప్పకుండా మందులు వాడటం,వైద్యుల సలహాలు,సూచనలు పాటించడం,పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పూర్తిగా నయం చేసుకోవచ్చు.అలాగే శరీరం పై స్పర్శ లేని మచ్చలు,చర్మం పొడిబారడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే కుష్టు వ్యాధి నిర్దారణ పరీక్షను చేయించుకోవడం,ఒకవేళా కుష్టు జబ్బుగా డాక్టర్లు గుర్తిస్తే వెంటనే సరియైన చికిత్స చేసుకోవడం వల్ల నష్టాన్ని నివారించవచ్చు.కుష్టు అనేది శాపం కాదని, అన్ని వ్యాధుల లాగే ఇది కూడా ఒక జబ్బేనని గుర్తించి సకాలంలో చికిత్స చేయించుకునేలా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి.
No comment allowed please