K Keshava Rao : ఎన్డీఏ వైఫల్యం అందుకే బహిష్కరించాం
బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు కామెంట్
K Keshava Rao : పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. భారత రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీలు మంగళవారం నాటి సమావేశాలను బహిష్కరించాయి. ఈ మేరకు బీఆర్ఎస్ ఎంపీ , సీనియర్ నాయకుడు కే కేశవరావు(K Keshava Rao) మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు అమలు చేసిన పాపాన పోలేదన్నారు. అందుకే తాము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించినట్లు స్పష్టం చేశారు. కావాలని తాము కించ పర్చ లేదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది పలు రూపాలలో ఉంటుందని తాము కూడా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడం, వ్యాపారవేత్తలకు వత్తాసు పలకడం, ప్రధానంగా ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేసిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు కే కేశవరావు. అందుకే ఇదే సరైన వేదికగా తాను భావించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పద్దతుల్లోనే తాము ప్రసంగాన్ని బహిష్కరించడం జరిగిందని స్పష్టం చేశారు బీఆర్ఎస్ ఎంపీ(K Keshava Rao).
ఇక నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తాము ఎండగడతామని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు ఎంపీ కే కేశవరావు. అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చిస్తామని స్పష్టం చేశారు. అంతే కాకుండా గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగంపై పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు ఎంపీ.
Also Read : తలొంచిన ప్రభుత్వం గవర్నర్ కు ఆహ్వానం