Britain Demonstration : యుకె సర్కార్ పై ఉద్యోగులు కన్నెర్ర
జీతాల కోసం ఆందోళన..నిరసన
Britain Demonstration : యుకె ప్రధానిగా కొత్తగా కొలువు తీరిన రిషి సునక్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఉద్యోగులు నిరసన బాట పట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. జీతాలు పెంచాలంటూ గత కొంత కాలం నుంచీ కోరుతున్నారు. ఇందుకు సంబంధించి వేతనాల వివాదం తీవ్ర రూపం దాల్చడంతో సమస్య పరిష్కారం కోసం వేలాది మంది రోడ్డెక్కారు.
లండన్ లోని వెస్ట్ మినిస్టర్ లోని పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించారు. కార్మికులు సమ్మె బాట పట్టారు. బడులను మూసి వేస్తున్నారు. యూనివర్శిటీలలో సైతం అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. బ్రిటన్ లో(Britain Demonstration) ఇంత పెద్ద ఎత్తున భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం గత 10 ఏళ్లలో ఇదే మొదటిదని పేర్కొంటున్నారు.
పలు రంగాలకు చెందిన వారంతా నిరసనలో పాల్గొనడం తలనొప్పిగా మారింది. టీచర్లు, యూనివర్శిటీ సిబ్బంది, రైలు డ్రైవర్లు, పౌర సేవకులు, విమానాశ్రయాలలో పాస్ పోర్ట్ లను తనిఖీ చేసే సిబ్బంది తో సహా వివిధ రంగాలకు చెందిన వారంతా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సంవత్సరాల తరబడి ద్రవ్యోల్బణం కారణంగా జీవన ప్రమాణాలు పడి పోతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆందోళనకారులు.
ఇక 48 యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రేడ్స్ యూనియన్ ప్రభుత్వ బిల్లును నిరసిస్తూ యుకె అంతటా 75కి పైగా ర్యాలీలు దేశమంతటా చేపట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 4 లేదా 5 శాతం పెంపుదల అందించింది సర్కార్. కానీ వార్షిక ద్రవ్యోల్బణం 10.5 శాతం వద్ద నడుస్తుండడం విశేషం. వేతనం, పని పరిస్థితులు, సమ్మె హక్కును అడ్డుకునే వివాదాస్పద ప్రభుత్వ బిల్లుపై లండన్ లో కవాతు నిర్వహించారు.
Also Read : అజిత్ దోవల్ తో ఆంటోనీ బ్లింకెన్ భేటీ