Revanth Reddy : ప్రగతి భవన్ కూల్చేస్తే శని పోతుంది
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్
Revanth Reddy : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. పాదయాత్రలో భాగంగా సీఎం కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి పట్టిన శని పోవాలంటే ప్రగతి భవన్ ను కూల్చాల్సిందేనని అన్నారు. కేసీఆర్ తలకిందులు చేసినా ఈసారి గెలిచే ప్రసక్తి లేదన్నారు. సామాన్యులకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటేనని పేర్కొన్నారు.
గతంలో ఏనాడూ ఇలా ఏ సీఎం ప్రవర్తించ లేదన్నారు. రాష్ట్రంలో సమస్యలు పేరుకు పోతే సీఎం మాత్రం ఫామ్ హౌస్ లో నిద్ర పోతున్నాడంటూ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. ఫిరాయింపుదారులకు, కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ప్రగతి భవన్ కేరాఫ్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల చెవుల్లో పూలు పెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).
మహబూబాబాద్ లో రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ఇక్కడ కలెక్టర్లకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. మహిళా కలెక్టర్ చేయి పట్టి గుంజిన ఘనమైన చరిత్ర ఉన్నోడు ఈ ఎమ్మెల్యే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రజాకర్ల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత ఈ ప్రాంతానికి ఉందని , ప్రజలు చైతన్యవంతం అయిన రోజున కేసీఆర్ ఆటలు సాగవని, పప్పులు ఉడకవని స్పష్టం చేశారు.
రాజులు పోయారు, రాజ్యాలు కూలి పోయాయి..ప్రజలే శాశ్వతం అని కేసీఆర్ తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో ప్రగతి భవన్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు.
Also Read : నిన్న గోరంట్ల నేడు మల్హోత్రా