#Suraiya : జనవరి 31… భగ్న ప్రేమికురాలు సురయ్య వర్ధంతి
January 31 ... Actress Suraiya Death Anniversary
ఆమె అందంలో అప్సరస. ఆమెది గంధర్వ గానం. ఒకనాడు హిందీ సినీ చిత్ర సీమను మకుటం లేని మహా రాణిగా ఏలింది. నిర్మాతలకు కల్పవృక్ష మైంది. నాటి యువకుల హృదయ సామ్రాణిగా నిలిచింది. అత్యంత పారితోషికం తీసుకునే కథానాయకురాలిగా ఉంటూ, ఒక హీరో ప్రేమను చూరగొని, ప్రేమకు మతాలు అడ్డు గోడలైన కారణంగా సినీ జీవితాన్ని వదులు కోవడం కాకుండా, జీవితాంతం అవివాహిత గా ఉండి పోయింది భగ్న ప్రేమికురాలు. ఆమెనే అలనాటి అందాల తార, గాయని సురయ్య.
తెరమీద అభినయించే నటీనటులకు గాయనీ గాయకులు నేపథ్యగానాన్ని అందించే ప్రక్రియ ఇంకా ఆరంభంకాని దశలో అందం, అభినయం, సుమధుర గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఏకైక విదూషీమణి సురయ్య. నాలుగో దశకంలో బాలీవుడ్‌ను సురయ్య, నూర్జహాన్లనే ఇద్దరూ నట గాయనీ మణులు ఏలేవారు. అప్పటికీ నూర్జహాన్ అనే వర్సటైల్ సింగర్ కమ్ యాక్టరెస్ ఉన్నా అందంలో మాత్రం సురయ్యదే పైచేయి. దేశ విభజన తర్వాత నూర్జహాన్ పాకిస్తాన్‌కు వెళ్లిపోగా, సురయ్యకు తిరుగు లేకుండా పోయింది. 1946 నుంచి 1950 వరకు సురయ్య మకుటంలేని మహారాణిలా బాలీవుడ్లో చెలామణి అయింది.
1940 వ దశకంలో ఆమె హిందీ తెరపై ఒక సూపర్ స్టార్ అనిపించు కోవడమే కాకుండా నాటి యువకులకు ఓ ఆరాధ్య దేవత. రేడియో కార్యక్రమంలో పాడుతుంటే, ఆమె గురించి తెలుసుకుని నాటి ప్రఖ్యాత సంగీత దర్శకుడు నౌషాద్ ఆమెను హిందీ వెండి తెరకు పరిచయం చేశాడట. మీర్థా గాలిబ్’ లో ఆమె చౌద్వీన్ పాత్ర పోషించడమే కాకుండా ఆమె పాడిన గాలిబ్ గజళ్ళు విని, చిత్రానికి చూసి నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆమెను “నీవు గాలిబ్ ను పునరుజ్జీవింప చేశావు” (you have brought back Ghalib to life) అని ప్రశంసించారట.
జూన్ 25, 1929లో లాహోర్ నగరంలో జన్మించిన సురయ్య జమాల్ షేక్ చిన్నప్పుడే ముంబాయిలో ఉంటూ కర్దార్ ఫిలిం కంపెనీలో పని చేస్తున్న తన మేనమామ దగ్గరకు వచ్చిన సందర్భంలో, ఆమె సినిమాల్లోకి రావడం యాదృచ్ఛికంగానే జరిగింది. ఓసారి తన అంకుల్‌తో కలిసి తాజ్‌మహల్ సినిమా షూటింగ్‌కు వచ్చిన సురయ్యకు అనుకోకుండానే అందులో ముంతాజ్ మహల్ పాత్ర దొరికింది. పసితనపు ఛాయలు వీడని ఆమెతో శారద సినిమాలో ఓ పాట పాడించి పెద్ద సాహసమే చేశాడు ప్రఖ్యాత సంగీత దర్శకుడు నౌషాద్. ఆ పాట భారతదేశ మంతటా మారుమోగింది. దాంతో సురయ్య ఓవర్ నైట్ లో స్టార్ అయింది. మధురాతి మధురంగా గానం…అద్భుతమైన నటన..పాలరాతి శిల్పం లాంటి అందమైన సురయ్య, క్రమేణ నిర్మాతల పాలిటి కల్పవృక్షమయ్యిందంటే అతిశయోక్తి కాదు. 1945 నుండి 1961 దాకా అత్యధిక పారితోషికం తీసుకున్న నటి సురయ్య.
తర్వాత సురయ్య వరుసగా సినిమాలలో నటించింది. ఫూల్, విద్య, జీత్, దాస్తాన్, సనమ్, అఫ్సర్ వంటి సినిమాలు సురయ్యకు పేరును, నిర్మాతలకు డబ్బును తెచ్చిపెట్టాయి. నటుడు దేవానంద్ ను సిఫార్సు చేసి, ప్రోత్సాహాన్ని అందించింది. అయన సరసన చాలా చిత్రాలలో నటించి, ఉత్తమ జంటగా గుర్తింపు పొందింది. 1948లో వచ్చిన ప్యార్ కీ జీత్, 1949లో వచ్చిన బడీ బెహన్, దిల్లగీలు బాక్సాఫీసును బద్దలు కొట్టాయి. సొహ్రబ్ మోదీ దర్శకత్వంలో వచ్చిన మీర్జా గాలీబ్ సినిమా సూపర్ హిటయ్యింది. ఆ సినిమా రెండు జాతీయ అవార్డులను కూడా గెల్చుకుంది. సినిమా చూసిన నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ సురయ్యను ఎంతగానో అభినందించారు. అలా తిరుగులేని నటిగా, గాయనిగా పేరు ప్రఖ్యాతులు గడించిన సురయ్య 34 ఏళ్ల వయసుకే ప్రేమ వైఫల్యం కారణంగా అర్థాంతరంగా సినిమాల్లోంచి తప్పుకుంది.
1946 లో అన్ మోల్ షడీ చిత్రానికి అవార్డు పాటు 1954- మీర్జా గాలిబ్” ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్, 1996- స్క్రీన్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్, 1998- ప్రధాని వాజ్ పేయ్ చేతుల ద్వారా సన్మానం, సాహిత్య అకాడమీ అవార్డ్ ఫార్ హర్ పార్టిసిపేషన్ ఇన్ మీర్జ గాలిబ్బి మల్ రాయ్ మెమోరియల్ అవార్డ్- 1999, దాదాసాహెబ్ ఫాల్కే అకాడెమీ అవార్డ్- 2003, బెస్ట్ ఆన్ స్క్రీన్ బ్యూటీ ఇన్ 100 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ విత్ ఎత్నిక్ లుక్ అవార్డ్ – 2013 (మరణానంతరం) సొంతం చేసుకుంది. 2013 మేలో కేంద్ర ప్రభుత్వం ఆమె పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.
నాలుగు పదుల వయస్సు దాటిన తరువాత దేవానంద్ కు నాటి ప్రముఖ గాయని, నటి సురయాతో కలసి నటించే అవకాశం వచ్చింది. అప్పట్లో దేవానంద్ కంటే కూడా సురయ్యకే స్టార్ డమ్ ఎక్కువగా ఉండేది. నిర్మాతలు, దర్శకులు కూడా అలాగే భావించేవారు. కథల్లో కూడా ఆమె పాత్రలకే ప్రాధాన్యం ఉండేది. వారిద్దరూ కలసి పలు చిత్రాల్లో నటించారు. దేవానంద్, సురయ్య 1948 నుంచి 1951 మధ్య ఆరు చిత్రాలలో కలిసి నటించారు. విద్య (1948), జీత్ (1949), షాయిర్ (1949), అప్సర్ (1950), నిలి (1950), దో సితారే (1951), సనమ్ (1951) లాంటివి బాక్సాఫీస్ హిట్ అయ్యాయి.
విద్య (1948) చిత్రం లోని కినారె కినారె చలె జాయెంగె పాట చిత్రీకరణ సమయంలో పడవ మునిగినప్పుడు, నీటిలో పడి మునిగి పోతున్న సురయ్యను దేవానంద్ రక్షించి ఆమెను ప్రేమించాడు. జీత్ చిత్రం చిత్రీకరణ సమయంలో దేవ్ ఆనంద్ తన ప్రేమ వ్యక్త పరిచాడు. కొన్నాళ్ళ పాటు వారి ప్రేమ వ్యవహారం రహస్యంగానే ఉండింది. అయితే వీరి ప్రేమకు సురయ్య తల్లి సానుకూల మయినా, హిందువయిన దేవానంద్ తో పెళ్లేమిటని సురయ్య అమ్మమ్మ తీవ్రంగా నిరసించింది. దేవ్ ఫోన్ చేస్తే పరుషంగా మాట్లాడి, దేవ్ మనసును గాయ పరిచింది.
అయినా దేవ్, దివేచా అనే సినీఛాయా చిత్రకారుడి ద్వారా సురయ్యాకు 3000 రూ.లు ఖరీదు చేసే వజ్రపుటుంగరాన్ని పంపితే సురయ్య మహదానంగా స్వీకరిస్తే, తన కథ సుఖాంతమని భావించాడు దేవ్. చనిపోతామని బెదిరించి, సురయ్య ప్రేమకు ఆమె బంధుగణం అడ్డు వచ్చింది. భగ్న హృదయురాలైన సురయ్య, దేవ్ పంపిన ఉంగరాన్ని సముద్రంలో విసిరేసింది. అలా తన ప్రేమను చంపుకుంది. దో సితారె (1951) వీరిరువురూ కలిసి నటించిన చివరి చిత్రం. దో సితారే సినిమా తరువాత ఎన్నడూ వారిద్దరూ కలసి నటించలేదు.
సురయ్య జీవితాంతం అవివాహత గానే మిగిలి పోయింది. తనను ప్రేమించిన దేవానంద్ ను వలచిన ఆమె మరొకరితో జీవితాన్ని పంచుకోలేక పోయింది. వివాహం చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగానే గడిపి, సురయ్య తన 75వ సంవత్సరంలో (2004) ముంబాయిలో కన్ను మూసింది. సురయ్య జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం ఓ తపాలా బిళ్ళని విడుదల చేసింది.
No comment allowed please