Sanjay Raut Shivsena Symbol : పార్టీ గుర్తు కోసం రూ. 2 వేల కోట్లు డీల్
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపణ
Sanjay Raut Shivsena Symbol : శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. శివసేన పార్టీకి సంబంధించి విల్లు బాణం గుర్తు కోసం ఏకంగా రూ. 2,000 కోట్ల డీల్ కుదిరిందని షాకింగ్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా శివసేన పార్టీకి సంబంధించి తిరుగుబాటు జెండా ఎగుర వేసిన ఏక్ నాథ్ షిండే వర్గానికి అనుకూలంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విల్లు బాణం గుర్తు షిండే శివసేన పార్టీకి చెందుతుందని వెల్లడించింది.
దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే. పక్షపాతంతో కూడుకున్నదని , కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దాసోహం అయ్యిందంటూ ఆరోపించారు. దీనిని తాము ఒప్పుకోమని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు మాజీ సీఎం. ఈ తరుణంలో శివసేన బాల్ ఠాక్రే పార్టీకి చెందిన జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut Shivsena Symbol) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పార్టీ గుర్తు కోసం భారీ ఎత్తున డీల్ కుదిరిందని త్వరలోనే వివరాలు బయట పెడతానంటూ ప్రకటించారు సంజయ్ రౌత్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఇది చిన్న మొత్తమేనని ఇంకా భారీగా కూడా ఉండనుందని ఆరోపించారు.
తాజాగా చేసిన ట్వీట్ కలకలం రేపింది. రెండు వేల కోట్లు అనేది ప్రాథమిక అంకె. ఇది 100 శాతం నిజమని పేర్కొన్నారు. పాలక వర్గానికి దగ్గరగా ఉండే ఒక బిల్డర్ తనతో ఈ సమాచారం పంచుకున్నారని త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు సంజయ్ రౌత్.
Also Read : విల్లు బాణం షిండే దరహాసం