Rahul Gandhi : ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం
హెచ్చరించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi Cambridge : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గతంలో కంటే ఎక్కువగా భారత దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని హెచ్చరించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేష పూరిత రాజకీయాలకు కేరాఫ్ గా మారిందని ధ్వజమెత్తారు. ఫోన్ లో మాట్లాడేటప్పుడు తనను జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారని తెలిపారు. బ్రిటన్ లోని కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi Cambridge) కీలక ప్రసంగం చేశారు.
ఆయన మరోసారి కేంద్రంలో కొలువు తీరిన ప్రధాని మోదీని, భారతీయ జనతా పార్టీని, దాని అనుబంధ సంస్థలను ఏకి పారేశారు. కేంద్రంలో ప్రభుత్వం అన్నది లేకుండా పోయిందని అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని ఆరోపించారు రాహుల్ గాంధీ.
భారత ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రాథమిక నిర్మాణంపై దాడి జరిగిందన్నారు. ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ తన ఫోన్ లోకి స్నూప్ చేసేందుకు ఉపయోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కాల్స్ రికార్డ్ అవుతున్నాయని ఇది ఏ రకమైన డెమోక్రసీ అని ప్రశ్నించారు.
21వ శతాబ్దంలో వినడం నేర్చుకోవడం అనే అంశంపై కేంబ్రిడ్జి యూనివర్శిటీ లోని బిజినెస్ స్కూల్ లో ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఇందుకు సంబంధించిన యూట్యూబ్ లింక్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు.
సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తాము పరిశీలించిన 29 మొబైల్ ఫోన్లలో స్పైవేర్ కనిపించ లేదని కానీ మాల్వేర్ కనుగొన్నట్లు నిర్దారించిందని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). దేశంలో పార్లమెంట్ ,పత్రికలు, మీడియా, న్యాయ వ్యవస్థపై ఆంక్షలు విధించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ప్రతి ఒక్కరికీ అర్థమై పోయిందన్నారు రాహుల్ గాంధీ.
Also Read : కైలాస ప్రసంగం పరిగణలోకి తీసుకోం