MLC Kavitha CM KCR : సీఎం కేసీఆర్ తో కవిత భేటీ
ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణపై ఆరా
Kavitha CM KCR : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో ఈడీ ముందు విచారణకు హాజరైంది. దాదాపు 9 గంటల పాటు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత రాత్రి 8.05 నిమిషాలకు బయటకు వచ్చింది.
విచారణ పూర్తయిన వెంటనే హైదరాబాద్ కు వచ్చారు. ఆదివారం నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడే ఉన్న తండ్రి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తో తనయ ఎమ్మెల్సీ కవిత భేటీ(Kavitha CM KCR) అయ్యారు. ఢిల్లీలో విచారణకు సంబంధించిన విషయాల గురించి తండ్రితో పంచుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి తన్నీరు హరీశ్ రావు కూడా ఉండడం విశేషం.
ఇదిలా ఉండగా లిక్కర్ స్కాం కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవితేనని(Kavitha) ఇప్పటికే ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించిందని పేర్కొంది. ఆమెతో పాటు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారని కుండ బద్దలు కొట్టింది. అంతకు ముందు ఇదే కేసుకు సంబంధించి సీబీఐ 34 మందిపై అభియోగాలు మోపింది. మనీ లాండరింగ్ జరిగిందని పేర్కొనడంతో ఈడీ రంగంలోకి దిగింది.
నేరుగా కవితకు సంబంధించి బోయినపల్లి అభిషేక్ రావు, శ్రీనివాసరావు, రామచంద్రన్ పిళ్లై , ఆడిటర్ బుచ్చిబాబులను అరెస్ట్ చేసింది. వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. మార్చి 9న రావాల్సిందిగా కోరితే తనకు కుదరదని చెప్పింది. దీంతో ఈడీ ఎట్టి పరిస్థితుల్లో 11న రావాల్సిందేనంటూ ఆదేశించింది. చివరకు 9 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.
Also Read : పేపర్ లీక్ వ్యవహారం కలకలం