D Srinivas Congress : కాంగ్రెస్‌లోకి ఎంట్రీపై డీఎస్ కీలక ప్రకటన

D Srinivas Congress : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా పనిచేసిన డీ.శ్రీనివాస్.. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌కు దూరంగా ఉన్న ఆయన.. కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది.

ఈ వార్తలపై తాజగా డీఎస్ క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని, కాంగ్రెస్‌లో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవమని తెలిపారు.‘నా పెద్ద కుమారుడు సంజయ్ తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నాడు. 

చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీలో ఉన్నాడు. పార్టీలు వేరైనా ఇద్దరు తెలంగాణ కోసం పనిచేస్తున్నారు. నా ఆరోగ్యం సహకరిస్తే గాంధీభవన్‌కు వెళ్లి పెద్ద కుమారుడిని ఆశీర్వదిస్తా. 

కాంగ్రెస్‌లో చేరుతున్న సంజయ్‌కు నా శుభాకాంక్షలు. నా ఇద్దరు కుమారులు ప్రజల కోసం పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నా’ అని డీఎస్ అన్నారు. అయితే ఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి సమక్షంలో సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 

జిల్లా నేతలు సంజయ్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో తిరిగి చేర్చుకోవద్దని ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ డీఎస్ చొరవతో ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ ఎంట్రీకి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో నేడు సంజయ్ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. సంజయ్ గతంలో మేయర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా డీఎస్ కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. 

దీంతో ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా డీఎస్‌కు(D Srinivas Congress) పేరుంది.

రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత టీఆర్ఎస్‌కు ఆయన దూరమయ్యారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. దీంతో క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. వారసులను రాజకీయాల్లోకి దింపి వారికి అండగా ఉంటున్నారు.

అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటు వేయడాన్ని ఖండిస్తూ నేడు దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలకు ఢిల్లీ హైకమాండ్ పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

Also Read : దేశం లో కరోనా హెచ్చరికలు అప్రమత్తమైన కేంద్రం

Leave A Reply

Your Email Id will not be published!