Akal Takht : అమృతపాల్‌ అనుచరుల్ని 24 గంటల్లోగా వదిలిపెట్టాలి

Akal Takht : అమృత్‌పాల్‌ సింగ్ అనుచరులుగా భావించి అరెస్ట్ చేసిన సిక్కు యువకులను 24 గంటల్లోగా విడుదల చేయాలని పంజాబ్ ప్రభుత్వానికి సిక్కుల అత్యున్నత సంస్థ అకల్‌ తఖ్త్‌ జతేదార్ (చీఫ్) జ్ఞానీ హర్‌ప్రీత్‌ సింగ్‌ అల్టిమేటం జారీచేశారు.లేనిపక్షంలో సిక్కుల్లో ఆగ్రహం ఉద్ధృతమవుతుందని ఆప్ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.

సోమవారం అన్ని సిక్కు సంఘాలతో జరిగిన భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న అమృత్‌పాల్‌ సింగ్‌ను పోలీసులకు లొంగిపోవాలని హర్‌ప్రీత్ రెండు రోజుల కిందట సూచించిన విషయం తెలిసిందే.

తమ అల్టిమేటంను గౌరవించకపోతే గ్రామస్థాయిలో ప్రభుత్వ కుతంత్రాలను బట్టబయలు చేసేందుకు అకల్ తఖ్త్(Akal Takht) ‘ఖల్సా వాహిర్’ను ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మార్చి 19 నుంచి రెండో దశ ఖల్సా వాహిర్‌ను ప్రారంభించాలని పరారీలో ఉన్న అమృతపాల్ నిర్ణయించిన సంగతి విదితమే.  

ఈ వహిర్ సమయంలో మత ప్రచారంతో పాటు మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం కూడా నిర్వహించనున్నట్టు మతపెద్ద తెలిపారు.  ‘ఖల్సా వాహిర్‌లో భాగంగా సిక్కు గురుద్వార్ ప్రబంధ్ కమిటీ, శిరోమణి అకాలీదళ్ సహా అన్ని సిక్కు సంఘాలూ ప్రజల్లోకి వెళ్లి సిక్కులను ఏవిధంగా భయబ్రాంతులకు గురిచేసి, పరువుపోయేలా చేస్తున్నారో వివరిస్తారు’ అని చెప్పారు.

‘కుట్ర’లో భాగంగా సిక్కులపై ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించేందుకు పంజాబ్, కేంద్ర ప్రభుత్వాలతో పాటు కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ప్రయత్నిస్తున్నాయని మండిపడింది.

దేశం, విదేశాలలో సిక్కుల పరువు తీయడానికి ప్రయత్నిస్తున్న శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని SGPCని జతేదార్ ఆదేశించారు.. దీని కోసం మేము ఇప్పటికే న్యాయవాదుల ప్యానెల్‌ను ఏర్పాటు చేశాం’ అని పేర్కొన్నారు.

పంజాబ్ ప్రభుత్వం మూసివేసిన 100 సిక్కు ఛానెల్‌లను పునరుద్ధరించాలని సిక్కు సంస్థల ప్రతినిధులు మరో అల్టిమేటం జారీ చేశారు.

సిక్కుల అణచివేతకు వ్యతిరేకంగా అన్ని సిక్కు సంఘాలు ఐక్యంగా పోరాడాలని కోరారు. అకాల్ తఖ్త్‌లో(Akal Takht) జరిగిన సమావేశంలో కొంతమంది సిక్కులు ఖలిస్థాన్‌కు అనుకూలంగా.. అమృతపాల్‌కు మద్దతుగా.. కొన్ని జాతీయ మీడియా సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

అలాగే, అమృతపాల్‌ గాలింపు ఆపరేషన్‌లో భాగంగా అరెస్టయిన వారికి న్యాయపరమైన సహకారం అందజేయాలని నిర్ణయించారు. అక్రమ కేసులతో అరెస్టయిన తమ పిల్లలకు న్యాయసహాయం కోసం ఎస్జీపీసీ బాధిత కుటుంబాలు సంప్రదించాలని, అందుకయ్యే ఖర్చులను పూర్తిగా తామే భరిస్తామని స్పష్టం చేశారు. 

మరోవైపు, తప్పించుకున్న అమృతపాల్‌ సింగ్ నేపాల్‌లో తలదాచుకున్నట్టు తెలుస్తోంది.

Also Read : భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే మృతి ! సంచలన విషయాలు

Leave A Reply

Your Email Id will not be published!