H D Deve Gowda : వామపక్షాలతో స్నేహం పోటీకి సిద్దం
మాజీ పీఎం హెచ్ డి దేవెగౌడ
H D Deve Gowda : దేశ వ్యాప్తంగా రాబోయే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారేందుకు విపక్షాలన్నీ ఐక్య ఫ్రంట్ గా ఏర్పాటయ్యేందుకు పావులు కదుపుతున్నాయి. ఇందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన తన వ్యూహాలకు పదును పెట్టారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. ఇదే సమయంలో మిగతా పార్టీలు కూడా ఒకే గొడుగు కిందకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ తరుణంలో సంచలన ప్రకటన చేశారు మాజీ ప్రధానమంత్రి హెచ్ డి దేవెగౌడ(H D Deve Gowda). వామపక్షాలతో కలిసి నిలబడతామని స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో భావ సారూప్యత కలిగిన పార్టీలు, వ్యక్తులతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు.
ఇదిలా ఉండగా మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జేడీఎస్ తన అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. జాబితా ప్రకారం దేవెగౌడ కోడలు భవానీ రేవణ్ణకు బదులుగా హాసన్ నియోజకవర్గం నుంచి హెచ్ పీ స్వరూప్ ను పోటీకి దింపాలని నిర్ణయించింది.
కర్ణాటక ఎన్నికల్లో సీపీఐ పోటీ చేయాలని యోచిస్తోందని తెలిపారు. మరో వైపు మహిళా రిజర్వేషన్ బిల్లును తిరిగి ప్రవేశ పెట్టే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతూ ప్రధానమంత్రి మోదీకి లేఖ రాసినట్లు జేడీఎస్ చీఫ్ దేవెగౌడ వెల్లడించారు. 1996లో తాను ప్రధానిగా ఉన్నప్పుడు దీనిని చేపట్టానన్నారు.
Also Read : బీజేపీ హై కమాండ్ కు షెట్టర్ వార్నింగ్