ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ సంచలన ప్రకటన చేశారు. కర్ణాటకలో వచ్చే మే నెల 10న పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తామని ధీమాతో ఉంది. తాము పవర్ లోకి వచ్చిన వెంటనే మెరుగైన ప్రజా పాలన అందజేస్తామని ప్రకటించారు.
తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సోమవారం ఏఐసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. గృహ జ్యోతి పథకంపై సంతకం చేస్తామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందజేస్తామని తెలిపారు మల్లికార్జున్ ఖర్గే.
అంతే కాకుండా గృహ లక్ష్మి పథకం కింద ప్రతి మహిళా కుటుంబ పెద్దకు రూ. 2,000 నెల నెలా పెన్షన్ అందజేస్తామని వెల్లడించారు. యువ నిధి పథకం కింద నిరుద్యోగ గ్రాడ్యూయేట్స్ కు నెలకు రూ. 3,000 , నిరుద్యోగ డిప్లొమా హోల్డర్స్ కు రూ. 1500 ఇస్తామని చెప్పారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బొమ్మై సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి అడ్రస్ గా మారిందని ఆరోపించారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు ఖర్గే.