జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. రాబోయే ఎన్నికల్లో రాజ్ నాథ్ సింగ్ పీఎం రేసులో ఉన్నారని పేర్కొన్నాడు. మోదీ కంటే రాజ్ నాథ్ సింగ్ రేసులో ఉన్నారంటూ బాంబు పేల్చారు. 2019 పుల్వామా దాడికి మోదీ ప్రభుత్వమే కారణమని సత్య పాల్ మాలిక్ ఆరోపించారు.
పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఆయనపై సీరియస్ గా స్పందించారు. తాను ఏనాడూ తప్పు చేయలేదని స్పష్టం చేశారు సత్యపాల్ మాలిక్. కేంద్రం ఎవరితోనైనా విచారణ చేపట్ట వచ్చని సవాల్ విసిరారు. తాను సత్యం కోసం నిలబడతానని అన్నారు సత్యపాల్ మాలిక్. తనను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా తాను తగ్గే ప్రసక్తి లేదని చెప్పారు.
రాజస్థాన్ లోని సికార్ లో మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో భద్రతా వాహనాల కాన్వాయ్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది మరణించారు. దీనికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని సంచలన ఆరోపణలు చేశారు సత్య పాల్ మాలిక్. ఇంటెలిజెన్స్ వైఫల్యాలను తప్పు పట్టారు. ఇటీవల సీబీఐ సమన్లు పంపించడాన్ని కొట్టి పారేశారు.