నిరసన ప్రాథమిక హక్కు. న్యాయ పరమైన హక్కుల కోసం ఆందోళన చేపడితే అరెస్ట్ చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్. ముంబైకి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్సు , సోల్ గావ్ ప్రాంతాలలో ప్రభుత్వ వాహనాలు రిఫైనరీ ప్రతిపాదిత స్థలంలో ప్రవేశించకుండా నేలపై పడుకుని రోడ్డును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిలో 100 మందికి పైగా మహిళలు ఉన్నారు. చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రిఫైనరీ ప్రాజెక్టు కోసం బార్సు సైట్ ను ఆనాడు సీఎంగా ఉన్న ఉద్దవ్ ఠాక్రే సూచించారని అంగీకరించారు. కానీ దానిని రాజకీయం చేయడం ఎంత మాత్రం తగదని పేర్కొన్నారు. సంజయ్ రౌత్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. కాగా స్థానికులు గనుక దానిని వ్యతిరేకిస్తే తమ పార్టీకి వారికి బేషరతుగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ పై నిప్పులు చెరిగారు.
ముందు సైట్ ను సందర్శించి నిరసనకారులతో మాట్లాడాలని కానీ ఆనాడు ఠాక్రే రాసిన లేఖను చూపడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రాజకీయంగా మైలేజ్ కోసం ఉద్దేశ పూర్వకంగా ఈ ప్రాజెక్టు గురించి అపార్థాలు సృష్టిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు సంజయ్ రౌత్. ద్వంద్వ ప్రమాణాలకు ఇది పరాకాష్ట అంటూ పేర్కొన్నాడు.