PAK PM House Attack : పాక్ ప్రధాని ఇంటిపై దాడి
ఇమ్రాన్ అనుచరుల వీరంగం
మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓ వైపు ఆర్మీ కంట్రోల్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఖాన్ మద్దతుదారులు కన్నెర్ర చేస్తున్నారు. దాడులకు పాల్పడుతున్నారు. నిన్న ఆర్మీ క్వార్టర్స్ పై దాడికి దిగారు. తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నివాసంపై దాడికి యత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీకి చెందిన 500 మందికి పైగా మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. అక్కడ ఆగి ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. మరికొన్నింటిని తగుల బెట్టారు. అంతే కాదు పీఎం ఇంట్లోకి పెట్రోల్ బాంబులు విసిరారు. పంజాబ్ పోలీస్ సీనియర్ ఆఫీసర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
కాగా దుండగులు దాడి చేసిన సమయంలో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ , ఆయన కుటుంబీకులు ఎవరూ ఇంట్లో లేరని చెప్పారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. సాధ్యమైనంత మేరకు తాము కంట్రోల్ చేస్తున్నామని కానీ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రెచ్చి పోతున్నారంటూ మండిపడ్డారు. త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు.
దాడికి పాల్పడిన సమయంలో కేవలం గార్డులు మాత్రమే ఉన్నరాని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి పట్టుకుంటామని హెచ్చరించారు. 144 సెక్షన్ విధించామని హద్దులు దాటితే చర్యలు తప్పవన్నారు.
