కర్ణాటకలో ఎన్నికల సమరం ముగిసింది. 224 సీట్లకు గాను 2,516 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈనెల 13న ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు చూపిస్తుండగా మరికొన్ని బీజేపీ, హంగ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. గురువారం మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.
తాము ఎగ్జిట్ పోల్స్ నమ్మే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత బయట పడిందని, ప్రజలు మార్పు కోరుకున్నారని, బొమ్మై ప్రభుత్వం పట్ల విసిగి పోయారని అన్నారు. తమకు కనీసం 140 సీట్లకు పైగా వస్తాయని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
తమ పార్టీ గెలవబోతోందని ఈ క్రెడిట్ అంతా కార్యకర్తలు, నాయకులకే దక్కుతుందని తేల్చి చెప్పారు. తాము ప్రయత్నం చేశామని, దీంతో పాటు హై కమాండ్ కూడా ఫుల్ ఫోకస్ పెట్టిందన్నారు సిద్దరామయ్య.
ఈ సందర్బంగా పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేశారు. వాళ్లు తమ ఇంటిని , కుటుంబాన్ని కూడా విడిచి పెట్టి పని చేశారని కొనియాడారు. వారి శ్రమ ఫలించ బోతోందని తమ పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేయడం తథ్యమన్నారు సిద్దరామయ్య.
అధికారంలో ఉన్న పార్టీ ఎన్నో ఒత్తిళ్లకు గురి చేసింది. కేసులు బనాయించింది. బెదిరింపులకు దిగింది. కానీ పార్టీ కోసం ముందు నుంచి పని చేస్తున్న వారంతా మరోసారి శక్తి వంచన లేకుండా పార్టీ కోసం పనిచేశారని చెప్పారు సిద్దరామయ్య.
