సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ నూతలపాటి వెంకట రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుమలను సందర్శించారు. ఈ సందర్భంగా అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమల పవిత్రతను కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి భక్తుడిపై ఉందన్నారు ఎన్వీ రమణ. ఈ ఫుణ్య క్షేత్రానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తుంటారని , ఇదే సమయంలో టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోందని ప్రశంసించారు.
అయితే పలు చోట్ల ఇంకా వ్యర్థాలు వదిలి వేస్తున్నారని ఇది రాబోయే కాలంలో మరింత ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు. సాధ్యమైనంత మేరకు పచ్చదనం , పరిశుభ్రత అన్నది ప్రతి భక్తుడు పాటించాలని ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు మాజీ సీజేఐ.
ఇదిలా ఉండగా తిరుపతి – తిరుమల ఘాట్ రోడ్డు , అలిపిరి, శ్రీవారి మెట్ల నడక దారుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన సుందర తిరుమల శుద్ద తిరుమల కార్యక్రమంలో ఎన్వీ రమణ పాల్గొన్నారు. తిరుమల పుణ్య క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు చేస్తున్న టీటీడీ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు భాగం కావాలని పిలుపునిచ్చారు ఎన్వీ రమణ. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు.
ఈ సందర్భంగా ఈవో ఏవీ ధర్మారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు మాజీ సీజేఐ. ఇలాంటి కార్యక్రమాలు మరింత చేపట్టాలని సూచించారు.