YS Sharmila KCR : రైతులకు ఎన్ని టికెట్లు ఇచ్చావో చెప్పు
సీఎం కేసీఆర్ ను ప్రశ్నించిన వైఎస్ షర్మిల
YS Sharmila KCR : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఆమె మరోసారి తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. రైతులకు తెలంగాణలో ఎన్ని టికెట్లు ఇచ్చినవో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతు సమాధులపై దాష్టీక పాలన సాగిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక్కడ అన్నదాతలను ముంచిన కేసీఆర్ పక్కనే ఉన్న మహారాష్ట్ర రైతులను మోసం చేసేందుకు బయలు దేరాడంటూ ధ్వజమెత్తారు.
శనివారం ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. తెలంగాణలో బుడ్డ దొరలకు, జమీందార్లకు , ఉద్యమ ద్రోహులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన కేసీఆర్ మహారాష్ట్రలో మాత్రం రైతులు అసెంబ్లీకి పోవాలని పిలుపునివ్వడం దారుణంగా ఉందన్నారు వైఎస్ షర్మిల. తెలంగాణ మోడల్ అంటే తొమ్మిదేళ్ల పాలనలో 9 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమా అని ప్రశ్నించారు. పంట నష్టం జరిగితే మాట ఇచ్చి పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టారంటూ ఆరోపించారు.
రాయితీ ఎరువులు, విత్తనాలు ఇవ్వకుండా ఎత్తేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. బడా బాబులకు రూ. వేల కోట్ల రైతు బంధు దోచి పెట్టడం నిజం కాదా అని నిలదీశారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దాచుకోవడం వాస్తవం కాదా ఇది జనానికి తెలియదని అనుకుంటే ఎలా అని మండిపడ్డారు వైఎస్ షర్మిల. కనీసం కనికరం అన్నది చూపకుండా రైతుల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కేసీఆర్ కు మాత్రమే చెల్లిందంటూ ఎద్దేవా చేశారు.
Also Read : Rahul Priyanka