Satyender Jain : ఐసీయూలో మాజీ మంత్రి జైన్
బాత్రూంలో పడి పోయిన సత్యేందర్
Satyender Jain : మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఆప్ కు చెందిన ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్(Satyendra Jain) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన గురువారం ఉదయం ఉన్నట్టుండి బాత్రూంలో పడి పోయారు. దీంతో హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందజేస్తున్నారు. జైన్ తరపు వాదిస్తున్న న్యాయవాది గత వారం సుప్రీంకోర్టులో ఇదే విషయాన్ని వెల్లడించారు. మాజీ మంత్రి 35 కేజీలు తగ్గారని , ఒక రకంగా అస్థిపంజరంగా మారారని పేర్కొన్నారు. ఆయన వివిధ వ్యాధులతో బాధ పడుతున్నారని వాపోయారు.
ఇదిలా ఉండగా సత్యేందర్ జైన్ ను వైద్య సంరక్షణకోసం ఆస్పత్రికి తీసుకు వెళ్లడం వారంలో ఇది రెండోసారి. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం సఫ్థర్ జంగ్ ఆస్పత్రిలో వెన్నెముకకు గాయం కోసం పరీక్షించబడ్డారు. అతడి ఆరోగ్యం గురించి ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంటూ ఆరోపించింది.
దీనికి ముందు సత్యేందర్ జైన్ ను దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. సిటీ స్కాన్ , ఎంఆర్ఐ సహా అనేక పరీక్షలు చేయించుకున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని , కాగా అబ్జర్వేషన్ లో ఉంచామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే బీజేపీ జైన్ ను చంపేందుకు యత్నిస్తోందంటూ ఆప్ ఆరోపించింది.
Also Read : CM MK Stalin