YS Sharmila KCR : దొర పాలనలో కళాకారులకు దిక్కేది
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
YS Sharmila KCR : వైస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) నిప్పులు చెరిగారు. మంగళవారం ఆమె ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. త్యాగాలు, బలిదానాల సాక్షిగా ఏర్పడిన తెలంగాణ కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీకే పరిమితమైందని ఆరోపించారు. కవులు, కళాకారులు, మేధావులకు విలువ లేకుండా పోయిందని ఆవేదన చెందారు. పోరాట యోధులకు గుర్తింపు లేకుండా పోయిందని మండిపడ్డారు.
ఉద్యమాల పునాదులపై, త్యాగాల ఊపిరితో ఏర్పడిందే తమ పార్టీ అంటూ గొప్పలు చెప్పు కోవడం తప్పా ఆదుకున్న చరిత్ర లేదన్నారు. మలి దశ ఉద్యమానికి తన బలిదానంతో ప్రాణం పోసిన శ్రీకాంతా చారి కుటుంంబాన్ని ఏనాడైనా ఆదుకున్నారా అంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిల.
ఇక విచిత్రం ఏమిటంటే గన్ పార్క్ అమరుల స్థూపం నిర్మించిన రూప శిల్పి యాదగిరి రావుకు బిల్లు ఇప్పటి వరకు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఘోరమైన అవమానం అనిపించడం లేదా అని సీఎం కేసీఆర్ ను నిల దీశారు వైఎస్ షర్మిల. పదవిలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
నిద్ర పోయారా లేక ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారంటూ మండిపడ్డారు. మోసగాళ్లు, దోపిడీ దొంగలు, కమీషన్ దారులు, అక్రమార్కులకు తెలంగాణ ప్రభుత్వం అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. వెంటనే బిల్లు చెల్లించి ఆదుకోవాలని కోరారు.
Also Read : CM Siddaramaiah : ‘అరసు’ జీవితం ఆదర్శ ప్రాయం – సీఎం
