MK Stalin : హిందీని రుద్దాలని చూస్తే ఖబడ్దార్ – స్టాలిన్
కేంద్రాన్ని హెచ్చరించిన ముఖ్యమంత్రి
MK Stalin : డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ పై మరోసారి రెచ్చి పోయారు. బలవంతంగా తమపై హిందీని రుద్దాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఎంకే స్టాలిన్. తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగించే ఏ దానిని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. సోమవారం సీఎం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్ర సర్కార్ కావాలని హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తోందంటూ ధ్వజమెత్తారు.
భారతీయ భాషల కంటే హిందీకి అనవసరమైన ప్రయారిటీ ఇస్తున్నారంటూ మండిపడ్డారు ఎంకే స్టాలిన్(MK Stalin). తమ విలువైన వనరులను ప్రజా సంక్షేమం కోసం కాకుండా మన గొంతులపై హిందీని ప్రయోగించాలని, అందుకోసం విలువైన ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం.
కేంద్రం ఆధ్వర్యంలోని సంస్థలలో విధిగా హిందీని వాడాలంటూ చైర్ పర్సన్ నీర్జా కపూర్ సర్క్యులర్ జారీ చేయడాన్ని తప్పు పట్టారు. హిందీ మాట్లాడని ఉద్యోగుల పట్ల చూపిన అగౌరవానికి వెంటనే క్షమాపణ చెప్పాలని ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. హిందీ మాట్లాడని వారిని రెండో భారత పౌరులుగా చూడటం తప్ప మరొకటి కాదన్నారు సీఎం. తమిళనాడు రాష్ట్రం ఇందుకు ఒప్పుకోదని స్పష్టం చేశారు. తమిళులు దేనినైనా భరిస్తారు కానీ భాషను అవమానించినా లేదా ఇంకో భాషను రుద్దాలని చూస్తే చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
Also Read : Anurag Thakur : దీదీ పాలనలో బెంగాల్ కాలి పోతోంది