Revanth Reddy : ధరణి పోర్టల్ పై విచారణ జరిపించాలి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్
Revanth Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ పై సమగ్ర విచారణ జరిపించాలని, ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణి వల్ల వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని, ఎవరి భూమి ఎక్కడుందో, ఎవరికి చెందిందో తెలుసుకోలేని స్థితిలో బాధితులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమార్కులకు అప్పనంగా ప్రభుత్వ భూములను చౌకగా కట్టబెట్టారని తీవ్ర స్థాయిలో సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సీఎం ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ సైబర్ నేరగాళ్ల లాగా రాష్ట్రాన్ని ధరణి పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్వహించాల్సిన రెవెన్యూ రికార్డు పోర్టల్ ను ప్రైవేట్ సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).
కేంద్ర సంస్థ కాగ్ సదరు కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టిందన్నారు. 90 వేల కోట్ల కు పైగా బ్యాంకు రుణాలు ఎగవేతకు పాల్పడిన సంస్థకు కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ధరణి రూపొందించడం వెనుక భూస్వాములు ఉన్నారని ఆరోపించారు. పోర్టల్ నిర్వహణ పూర్తిగా శ్రీధర్ రాజు చేతిలో ఉందని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. దాదాపు రూ. 50 వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు తమకు తెలిసిందన్నారు.
ఇప్పటి వరకు ధరణి పోర్టల్ ద్వారా జరిగిన 25 లక్షల ఎకరాల లావాదేవీలకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ జరగాల్సిన అవసరం ఉందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
Also Read : Jigna Vora Comment : ధీర వనిత జిగ్నా వోరా