Chakrasnanam : అంగరంగ వైభోగం చక్ర స్నానం
ఘనంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
Chakrasnanam : తిరుమల – శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రోజు చివరి రోజు. ఇవాళ శ్రీనివాసుడికి చక్ర స్నానం(Chakrasnanam) వైభవోపేతంగా సాగింది. భారీ ఎత్తున భక్తులు చేరుకున్నారు. శ్రీవారి పుష్కరిణిలో పుణ్య స్నానాలు చేశారు.
Chakrasnanam in Tirumala
తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు స్వామి వారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహ స్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్య హవచనం, ముఖ ప్రక్షాళన, ధూప దీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం చేపట్టారు.
అభిషేకం అనంతరం వివిధ పాశురాలను తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి వారి శిష్య బృందం పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మ వార్లకు అలంకరించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అర్చకం రామకృష్ణ దీక్షితులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
Also Read : GV Harsha Kumar : దర్యాప్తు సంస్థల తీరు దారుణం