Giri Pradakshina : ఇంద్ర‌కీలాద్రిలో ఘ‌నంగా పౌర్ణ‌మి

అమ్మ వారికి విశేష పూజ‌లు

Giri Pradakshina : విజ‌య‌వాడ – బెజ వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రి శ్రీ దుర్గా మ‌ల్లేశ్వ‌ర స్వామి దేవ‌స్థానంలో(Sri Kanaka Durga Temple) శుక్ర‌వారం పౌర్ణ‌మి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఉద‌యం లోకకళ్యాణార్థం, భక్త జన శ్రేయస్సు కొరకు, ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చార‌ణ‌లు, అమ్మవారి నామ స్మరణలు, మంగళ వాయిద్యముల నడుమ శ్రీ కామధేను అమ్మ వారి ఆలయం (ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద) వద్ద శ్రీ స్వామి, అమ్మ వార్లుకు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తముగా పూజలు నిర్విహించారు.

Giri Pradakshina in Bezawada

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కొబ్బరి కాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమము శ్రీ కామధేను అమ్మవారి ఆలయము, కుమ్మరి పాలెం సెంటర్, నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాల నృత్యములు తదితర సాంస్కృతిక కార్యక్రమాల‌ నడుమ తిరిగి ఆలయానికి చేరుకున్నారు.

గిరి ప్రదక్షిణ మార్గం నందు భక్తులు ప్రచార రథము లో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు, స్వామి వార్లకు భక్తి శ్రద్దలతో పూలు, పండ్లు, కొబ్బరికాయ లు సమర్పించి, పూజలు చేసి, అమ్మ వారిని, స్వామి వారిని ప్రార్థించి, అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు.

అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి. ఈ కార్యక్రమం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు చింకా శ్రీనివాస రావు, వైదిక సిబ్బంది, వేద పండితులు, కార్య నిర్వాహక ఇంజినీర్లు కె వి ఎస్ కోటేశ్వర రావు, ఇంజినీరింగ్ సిబ్బంది, అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు విశేషముగా పాల్గొన్నారు.

Also Read : Nara Lokesh Notice : లోకేష్ కు షాక్ సీఐడీ నోటీస్

Leave A Reply

Your Email Id will not be published!