Cabinet Sub Committee: కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ !

కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ !

Cabinet Sub Committee: తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంలో కీలక పాత్ర పోషించిన 6 గ్యారంటీల అమలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ప్రజాపాలన పేరుతో ఈ 6 గ్యారెంటీలను అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి డిప్యూటీ సిఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, సీఎస్‌ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తులపై ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు వివరించారు. 100 రోజుల్లోగా హామీల అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వారికి ఆయన సూచించారు.

అంతేకాదు ప్రజాపాలనను పకడ్బందీగా అమలు చేయడానికి డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన నలుగురు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో కేబినెట్ సబ్ కమిటీను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశాలు జారీ చేసారు. ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా, పారదర్శకంగా జరపాలని… 6 గ్యారంటీలకు వచ్చిన ప్రతి దరఖాస్తును లోతుగా పరిశీలించాలని, అర్హులందరికీ పథకాల ఫలితాలు అందాలని ఈ సందర్భంగా కేబినెట్ సబ్ కమిటీకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.

Cabinet Sub Committee – చిత్తశుద్ధితో ప్రజాపాలన హామీల అమలు – మంత్రులు పొంగులేటి, పొన్నం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం అనంతరం సచివాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో… ప్రజాపాలన హామీల అమలు వివరాలను వారు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి, పొన్నం మాట్లాడుతూ… ‘‘ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని రెండు హామీలను ఇప్పటికే అమలు చేశాం. డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6 వరకు పది రోజుల వ్యవధిలో ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 1,24,85,383 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఐదు పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా… రేషన్ కార్డులు, భూములకు సంబంధించిన ఇతర అంశాలపై 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం.

ఈ నెల 25 నుంచి 30 వరకు డేటా ఎంట్రీ పూర్తవుతుంది. ఇప్పటికే 30-40 శాతం డేటాను పొందుపరిచారు. ఆధార్‌, ఓటర్‌ కార్డు లేదా కుటుంబంలోని ఇతర కార్డులకు దరఖాస్తులు అనుసంధానం అవుతాయి. ఆ దరఖాస్తులను మంత్రివర్గ ఉపసంఘం క్రోడీకరించి, విధివిధానాలు రూపొందిస్తుంది. రేషన్‌ కార్డులపై కూడా స్పష్టత ఇస్తాం. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడం వీలుపడనివారు ఎవరైనా ఉంటే.. తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్జీల పరిశీలన తర్వాత గ్రామాల్లోనే అర్హుల జాబితా ప్రకటిస్తాం. నిర్దేశిత గడువు తేదీలోపు ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు,’’ అని వారు స్పష్టం చేసారు.

Also Read : CM Revanth Reddy : సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని నేతలకు ఆదేశాలు

Leave A Reply

Your Email Id will not be published!