Bilkis Bano Gang Rape Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు !
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు !
Bilkis Bano Gang Rape Case: గుజరాత్ లో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. బిల్కిస్‌బానో అనే మహిళను సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబంలో ఏడుగురు సభ్యుల దారుణ హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న 11 మంది దోషులకు విధించిన శిక్షను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ కేసు విచారణంతా మహారాష్ట్రలో జరిగినప్పుడు ముందస్తు విడుదలపై ఆ ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కోర్టు స్పష్టంచేసింది. గుజరాత్ ప్రభుత్వం చేసింది ముమ్మాటికీ అధికార దుర్వినియోగమేనని స్పష్టం చేసింది. నిందితులకు శిక్ష తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఏమాత్రం మనసుపెట్టి తీసుకున్నది కాదని, ఒక మూస ధోరణిలో ఉందంటూ దానిని కొట్టివేసింది. అంతేకాదు రెండు వారాల్లోగా దోషుల్ని తిరిగి జైలుకు పంపించాలని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం సోమవారం ఆదేశించింది.
Bilkis Bano Gang Rape Case – అసలేం జరిగిందంటే ?
2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో(Gujarat) మతపరమైన అల్లర్లు జరిగినప్పుడు భయాందోళనతో పారిపోతున్న బిల్కిస్ బానో అనే 21 ఏళ్ల వివాహిత అత్యాచారానికి గురయ్యారు. అత్యాచారం జరిగిన సమయంలో ఆమె ఐదు నెలల గర్భిణి. ఆమెపై దారుణానికి ఒడిగట్టడంతో పాటు ఆమె మూడేళ్ల కుమార్తె సహా కుటుంబ సభ్యుల్లో ఏడుగురిని హతమార్చడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన సిబిఐ(CBI) ప్రత్యేక న్యాయస్థానం 11 మంది నిందితులకు 2008 జనవరి 21న యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని, సాక్షులకు ముప్పు ఉంటుందని బానో అనుమానాలు వ్యక్తం చేయడంతో అప్పట్లో ఈ కేసు విచారణను అహ్మదాబాద్ నుంచి బాంబే హైకోర్టుకు మార్చారు. అయితే బాంబే హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించడంతో దోషులు 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. అనంతరం ఈ 11 మంది దోషులలో ఒకరు తనను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దానిని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్(Gujarat) ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి… ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫార్సు చేశారు. దీనితో ఈ దోషులందరికీ శిక్షను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 2022 ఆగస్టు 15న విడుదల చేసింది.
అయితే శిక్షాకాలం ముగియకముందే దానిని మాఫీచేసి (రెమిషన్ ఇచ్చి) విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బానో తదితరులు వేసిన పిటిషన్లపై 11 రోజులపాటు విచారణ జరిపిన ధర్మాసనం… నాలుగురోజుల్లో అసలైన దస్త్రాలను తమ ముందుంచాలంటూ గత ఏడాది అక్టోబరు 12న తీర్పును రిజర్వు చేసింది. సోమవారం 251 పేజీల్లో దాని తీర్పును వెలువరించింది. రెమిషన్ కోరుతూ దోషుల్లో ఒకరు చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలంటూ 2022 మే 13న సుప్రీంకోర్టుకు చెందిన మరో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపైనా ధర్మాసనం స్పందించింది.
ఇతర కోర్టులు ఇచ్చిన తీర్పులపై వాస్తవాలను దాచిపెట్టి, మోసపూరిత ప్రయత్నాల ద్వారా దోషి ఆ ఆదేశాలను పొందాడని పేర్కొంది. అందువల్ల దానిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆ తీర్పుపై గుజరాత్ ప్రభుత్వం ఎందుకు సమీక్ష కోరలేదో తమకు అర్థం కావడం లేదంది. ఏ వర్గానికి చెందినా, ఏ మత విశ్వాసాన్ని ఆచరిస్తున్నా ఒక మహిళపై హేయమైన నేరానికి ఒడిగట్టినవారికి రెమిషన్ ఇవ్వొచ్చా అని సూటిగా నిలదీసింది. చట్టబద్ధ పాలన అంటే అదృష్టవంతులైన కొందరిని కాపాడడం కాదు. ఎంతటివారైనా చట్టం ముందు సమానులే. ఇక్కడ సానుభూతికి తావు లేదు. పర్యవసానాలెలా ఉన్నా చట్టబద్ధ పాలనను కాపాడుకోవాల్సిందే’ అని ధర్మాసనం పేర్కొంది.
‘‘2022 మే నెలలో వచ్చిన తీర్పును తమకూ వర్తింపజేయాలని దోషులు దరఖాస్తులు చేశారు. వారిలో ఒకరితో గుజరాత్(Gujarat) కుమ్మక్కైంది. నిజాలను దాచిపెట్టింది. సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించింది. రెమిషన్‌ను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’ (పిల్) దాఖలు చేయడం సబబే. ఇది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. పిల్ చెల్లుబాటుపై సందేహం అక్కర్లేదు. దానిపై ఇంకెలాంటి సమాధానాలు అవసరం లేదు’’ అని తేల్చిచెప్పింది. అంతేకాదు 1992లో గుజరాత్ ప్రకటించిన శిక్ష తగ్గింపు విధానం ఈ కేసు దోషులకు వర్తించదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
సుప్రీంకోర్టు తీర్పు నాకు నిజమైన కొత్త సంవత్సరాన్ని తెచ్చింది. ఎంతో ఉపశమనంతో ఉద్వేగంతో నాకు కన్నీళ్లొచ్చాయి. దాదాపు ఒకటిన్నరేళ్ల తర్వాత తొలిసారిగా ఈరోజు నేను నవ్వాను. మా పిల్లల్ని హత్తుకున్నాను. గుండెపై ఓ పెద్ద బండరాయి తొలగినట్లయింది. నేను మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్నాను. అందరికీ సమాన న్యాయం జరుగుతుందన్న భరోసాను ఇచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు,” అంటూ ఈ కేసులో బాధితురాలు బిల్కిస్ బానో భావోద్వేగానికి గురైయింది.
కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి- ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ఈ కేసులో దోషులకు శిక్షాకాలం తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడం హర్షణీయమన్నారు. సోమవారం దారుస్సలాంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసదుద్దీన్ మాట్లాడుతూ… ఈ కేసులోని దోషులకు మద్దతు ఇచ్చిన గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధితురాలికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : Cabinet Sub Committee: కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ !