MP Kesineni Nani: త్వరలో వైసిపి కండువా కప్పుకోనున్న కేశినేని నాని !
త్వరలో వైసిపి కండువా కప్పుకోనున్న కేశినేని నాని !
MP Kesineni Nani: విజయవాడ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని నాని త్వరలో వైసిపిలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఎంపీ పదవికి రాజీనామా చేసిన నాని… విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ లో కార్పోరేటర్ గా ఉన్న తన కుమార్తె శ్వేత చేత కూడా రాజీనామా చేయించారు. తమ రాజీనామాలు ఆమోదం పొందిన తరువాత టిడిపి ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి… అభిమానులు, అనుచరులతో చర్చించి భవిష్యత్ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ ప్రకటన చేసి 24 గంటలు తిరగకముందే ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కేశినేని నాని(Kesineni Nani) సిఎం క్యాంప్ ఆఫీసులో భేటీ అయ్యారు.
కేశినేని నాని వెంట మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ తో పాటు విజయవాడకు చెందిన పలువురు వైసిపి నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అనంతరం… నాని(MP Kesineni Nani) మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా రాజీనామా చేశానని, ఆ రాజీనామాకు ఆమోదం లభించగానే… సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని ప్రకటించారు. ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు పచ్చి మోసగాడు అంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. విజయవాడ అంటే నాకు పిచ్చి ప్రేమ. అందుకోసమే ఎన్నో అవమానాలు భరించి తెలుగు దేశం పార్టీలో కొనసాగానని, ఇక భరించలేకనే ఆ పార్టీని వీడుతున్నట్లు నాని ప్రకటించారు.
MP Kesineni Nani – చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన నాని
2013 జనవరి 16 నుండి విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జ్ నియమించినప్పటి నుంచి పార్టీ గెలుపు కోసం ఎంతో శ్రమించానని కేశినేని నాని అన్నారు. నా సొంత వ్యాపార సంస్ధ కన్నా తెలుగుదేశం పార్టీ ముఖ్యం అని భావించి పార్టీ కోసం సుమారు రూ. 2 వేల కోట్ల మేర వ్యాపారాలను బంద్ చేయాల్సి వచ్చిందన్నారు. నా సొంత సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు చంద్రబాబును నమ్మి డబ్బులు ఎందుకు పాడుచేసుకుంటున్నావు హెచ్చరించారు. అయినా పట్టించుకోలేదు. ఆయన గెలుపు కోసమే కృషి చేశాను. పార్టీ కోసమే పని చేశాను.
కార్పోరేషన్, జెడ్పీటీసీ, ఎంపిటీసీ, జనరల్ ఎలక్షన్లో గెలిచాం. అప్పడు ఖర్చు పెట్టన ప్రతి రూపాయి నాదే. గతంలో కూడా నాకు సీటు ఇవ్వనంటే ప్రజలు డిమాండు చేయడంతో ఇచ్చారు. ఎంపిగా అక్రమ సంపాదనకోసం ఆశపడలేదు, వ్యాపారం వదులుకున్నా. పార్టీకి అన్ని రకాలుగా అండగా ఉన్నా… అయినప్పటికీ చంద్రబాబు తనను కనీసం లెక్క చేయలేదన్నారు. చాలా అవమనాలు భరించానని, ఇక భరించలేకనే ఆ పార్టీని వీడుతున్నట్లు ఎంపీ కేశినేని నాని తెలిపారు. చంద్రబాబు తనను అనేక రకాలుగా అవమానించారని ఆరోపించారు.
లోకేష్ మంగళగిరిలో ఓడిపోతే నేను ఎంపిగా గెలిచాను. నేను ఢిల్లీలో ఉండగా కార్పోరేషన్ ఎలక్షన్లలో మేయర్ అభ్యర్ధి ఎవరిని పెడుతున్నారని చంద్రబాబు ఫోన్ చేసి అడిగారు. నాకు తెలియదని బదులివ్వడంతో… బోండా ఉమ భార్యను పెడుతున్నారా అయితే ప్రమాదం… మీ అమ్మాయిని పెట్టండి అని చంద్రబాబు సూచించారన్నారు. అయితే నా కుమార్తెకు ఇష్టం లేకపోయినప్పటికీ పార్టీ కోసం చెయ్యాలి అంటూ బలవంతంగా ఒప్పించాను. కార్పోరేషన్లు ఎన్నికలకు రెండు రోజులు ముందు కేశినేని నానిని(Kesineni Nani) చెప్పుతో కొడతాను అని ఒక నాయకుడు అన్నాడు. అయినప్పటికీ పార్టీనుండి ఎవ్వరూ స్పందనలేదు. వాళ్ల ప్రెస్ మీట్ వల్ల పార్టీ చెల్లా చెదురు అయిపోయింది. సిట్టింగ్ ఎంపిని అయిన నేను లేకుండానే కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రచారానికి చంద్రబాబు వచ్చారు. అయినా బరించాను. ఈ నేపథ్యంలో పార్టీకు ఇష్టం లేకపోతే తప్పుకుంటాను అని చెప్పినప్పటికీ అందుకు అంగీకరించకపోగా… ఎంపీగా నువ్వే ఉండాలని చంద్రబాబు అందరి ముందే అన్నారని కేశినేని నాని గుర్తు చేశారు.
ఇప్పుడు నా కుటుంబ సభ్యులు ఎంపీ సీట్లు కావాలనుకుంటున్నారు. అందులో తప్పులేదు. కానీ, టీడీపీలో(TDP) 6 ఎంపి సీట్లు కమ్మ వర్గం వారే పోటీ చేస్తారు. అక్కడ ఇవ్వచ్చు కధా. నాకు తెలియకుండా ఇక్కడ ఎలా హమీ ఇస్తారు అని నాని ప్రశ్నించారు. ఆలపాటి రాజా, నెట్టెం రఘరాం, కొనకళ్ళ నారాయణను నా దగ్గరకు పంపి… తిరువూరు సభ విషయంలో నాని ఎందుకు కల్పించుకున్నారని లోకేష్ అడిగారని వారు చెప్పారు. ఆ రోజు రౌడీ మూకలతో కలిసి నన్ను కొట్టించాలని అనుకున్నారు. తొమ్మిదిన్నర ఏళ్ళలో పార్టీకి నేను చేసిన ద్రోహం ఏంటి ? మీరు జైల్లో ఉంటే మీకు, మీ కుటుంబానికి నేను అండగా నిలబడలేదా ? చంద్రబాబు మోసగాడు అని ప్రపంచానికి తెలుసు. కానీ, ఇంత మోసగాడని నాకు ఇప్పుడే తెలిసింది.’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నాని.
స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపిన నాని !
‘నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ లేఖను మెయిల్ ద్వారా లోక్‌సభ స్పీకర్‌కు పంపుతాను. రాజీనామాకు ఆమోదం లభించిన వెంటనే వైసీపీలో(YSRCP) చేరుతాను. విజయవాడకు సీఎం వచ్చిన ప్రతిసారి నేను అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే, పార్టీ ఆదేశం మేరకు వెళ్లలేదు. జగన్ పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి, అభివృద్ధి లేకపోవడానికి కారణం కోవిడ్. జగన్ నాకు బాగా నచ్చాడు.. నా రాజీనామా అమోదించగానే పార్టీలో చేరుతా.’ అని స్పష్టం చేశారు కేశినేని నాని.
Also Read : Chandrababu Naidu : చంద్రబాబుకు ఏపీ హైకోర్టు నుంచి భారీ ఊరట